KRMB: ఏపీలో నిర్మిస్తున్న రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ ప్రాజెక్టు 'గ్రీన్‌కో'పై తెలంగాణ అభ్యంత‌రం

  • అపెక్స్ కౌన్సిల్‌, బోర్డు అనుమ‌తుల్లేని ప్రాజెక్టుల‌ను ఆపాలన్న తెలంగాణ 
  • గ్రీన్ కో కోసం కృష్ణా జ‌లాల‌ను వినియోగించ‌రాదని అభ్యంతరం 
  • ఏపీలోని పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల వివ‌రాలు ఇవ్వాల‌న్న ముర‌ళీధ‌ర్‌
telangana enc letter krmb chairman over greenko project in ap

ప్ర‌పంచంలోనే అతిపెద్ద రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ ప్రాజెక్టుగా రికార్డుల‌కెక్కిన గ్రీన్ కో ప్రాజెక్టుపై తెలంగాణ ప్ర‌భుత్వం అభ్యంత‌రం తెలిపింది. ఈ ప్రాజెక్టుపై కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు తెలంగాణ ఈఎన్సీ ముర‌ళీధ‌ర్ మంగ‌ళ‌వారం కేఆర్ఎంబీ చైర్మ‌న్‌కు లేఖ రాశారు. ఈ లేఖ‌లో ముర‌ళీధ‌ర్ ప‌లు కీల‌క అంశాల‌ను లేవ‌నెత్తారు. 

ఏపీలోని క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లు ప‌రిధిలోని పిన్నాపురం వ‌ద్ద‌ గ్రీన్ కో సంస్థ ప్ర‌పంచంలోనే అతిపెద్ద రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ ప్రాజెక్టు ప‌నుల‌ను ప్రారంభించారు. వైసీపీకి చెందిన చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్ కుటుంబం ఆధ్వ‌ర్యంలోని గ్రీన్ కో సంస్థ ఈ ప్రాజెక్టును చేప‌ట్టింది. 

ఈ ప్రాజెక్టునే కేంద్రంగా చేసుకుని తెలంగాణ ఈఎన్సీ ముర‌ళీధ‌ర్ కేఆర్ఎంబీ చైర్మ‌న్‌కు లేఖ రాశారు. ఏపీలో చేప‌ట్టిన పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల‌పై ఆ లేఖ‌లో ఫిర్యాదు చేసిన ముర‌ళీధ‌ర్‌.. ఎలాంటి అనుమ‌తులు లేకుండానే ఏపీ స‌ర్కారు పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టులు చేప‌డుతోంద‌ని ఆరోపించారు. అనుమ‌తు‌లు లేని ఈ ప్రాజెక్టుల‌ను నిలువ‌రించాల‌ని ఆయ‌న కోరారు. అంతేకాకుండా ఏపీలోని పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల వివ‌రాలు తెప్పించి ఇవ్వాల‌ని కోరారు. 

క‌ర్నూలు జిల్లా పిన్నాపురం వ‌ద్ద చేప‌ట్టిన గ్రీన్ కో ప్రాజెక్టు కోసం కృష్ణా జ‌లాల‌ను వినియోగించ‌రాద‌ని తెలిపారు. కృష్ణా నుంచి ఇత‌ర బేసిన్ల‌కు జ‌లాల త‌ర‌లింపుపై ఆయ‌న‌ అభ్యంత‌రం తెలిపారు. జ‌ల విద్యుత్ కోసం కృష్ణా జ‌లాల వినియోగంపైనా ముర‌ళీధ‌ర్ అభ్యంత‌రం తెలిపారు. అపెక్స్ కౌన్సిల్‌, బోర్డు అనుమ‌తుల్లేని ప్రాజెక్టుల‌ను ఆపాల‌ని ఆ లేఖ‌లో ఆయ‌న కేఆర్ఎంబీ చైర్మ‌న్‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

More Telugu News