Nepal: విడిపోయిన దంపతుల రీయూనియన్ ట్రిప్ ప్రాణాలు తీసింది.. నేపాల్ ప్రమాదంపై దిగ్ర్భాంతికర విషయం

Nepal Plane Crash Has A Tragic Truth Behind as Estranged Couple Re Union Trip Ends In Sad
  • పిల్లలతో కలిసి అశోక్ త్రిపాఠీ, వైభవి అనే దంపతుల ట్రిప్
  • శాశ్వతంగా దూరం చేసిన విధి
  • ప్రమాదం నుంచి బయటపడిన వైభవి తల్లి
  • ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇంట్లోనే
ఆ దంపతులు విడిపోయి చాలా కాలమైంది. వాళ్లు మళ్లీ కలవాలనుకున్నారు. కుటుంబంగా ఒక్కటయ్యారు. కానీ, తామొకటి తలిస్తే విధి మరొకటి తలచిందన్నట్టు.. ఎన్నాళ్లకో కలిసిన ఆ దంపతులను శాశ్వతంగా వేరు చేసింది. మళ్లీ కలిసిన శుభ సమయాన ఆ దంపతులు ప్లాన్ చేసుకున్న ట్రిప్.. విషాదాంతమైంది. ఇదీ నేపాల్ విమాన ప్రమాదం గురించి వెల్లడైన దిగ్ర్భాంతికర విషయం. ఆ ప్రమాదంలో 22 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వివరాలు.. 

అశోక్ కుమార్ త్రిపాఠీ (54), థానేకి చెందిన వైభవి బందేకర్ త్రిపాఠీ (51)లు భార్యాభర్తలు. త్రిపాఠీ ఒడిశాలో ఓ కంపెనీని నడిపేవారు. ముంబైలోని బీకేసీలో ఉన్న ఓ సంస్థలో వైభవి జాబ్ చేసేది. అయితే, దాంపత్య జీవితంలో వచ్చిన ఘర్షణల కారణంగా విడాకులు తీసుకున్నారు. దీంతో కుమారుడు ధనుష్ (22), కూతురు రితిక (15)తో కలిసి వైభవి థానేలో విడిగా ఉంటోంది. 

అయితే, ఆ దంపతులు మళ్లీ కలిశారు. అందరూ కలిసి ఆదివారం నేపాల్ కు ట్రిప్ ప్లాన్ చేశారు. తారా ఎయిర్ లైన్స్ విమానాన్ని బుక్ చేశారు. కానీ, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నేపాల్ లోని ముస్తాంగ్ జిల్లాలోని కొండల్లో ఆ చిన్న విమానం కూలిపోయింది. ఆ విమాన శకలాలను సోమవారం అధికారులు గుర్తించారు. కాగా, ఆ విమానంలో వారితో పాటు ఇద్దరు జర్మన్లు, 13 మంది నేపాలీలు, ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నారు. 

మరోవైపు, వీరితో పాటే వెళ్లాల్సిన వైభవి తల్లి (80) అనారోగ్యం కారణంగా బతికిపోయింది. ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెను ఇంట్లోనే ఉంచి వెళ్లారు. వైభవి చెల్లెలు ఆమెను చూసుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఆక్సిజన్ సపోర్టుతో ఉండడంతో ప్రమాద వార్త ఇంకా ఆమెకు చెప్పలేదు.
Nepal
Plane Crash
Crime News
Accident

More Telugu News