Sonali Bendre: జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నేనా..? ఎవరు చెప్పారు?: సోనాలి బింద్రే

Sonali Bendre quashes rumours of joining Jr NTRs next project calls it fake news
  • తనకైతే ఆ విషయం తెలియదన్న సోనాలి 
  • ఇది తప్పుడు వార్త అయి ఉంటుందని వ్యాఖ్య 
  • లేదంటే తన వరకు ఇంకా రాకపోయి ఉండొచ్చన్న బింద్రే
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడుగా తెరకెక్కనున్న సినిమాలో తాను నటించనున్నట్టు వస్తున్న వార్తలను సీనియర్ బాలీవుడ్ నటి సోనాలి బింద్రే ఖండించారు. కొరటాల శివతో తన తదుపరి చిత్రం ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ లోగడ ప్రకటించడం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాను నందమూరి కల్యాణ్ రామ్ సమర్పిస్తుంటే, మిక్కిలినేని సుధాకర్, హరి కృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జూన్ లో షూటింగ్ మొదలు కావచ్చని తెలుస్తోంది.

ఈ సినిమాలో తాను కూడా నటించనుందన్న వార్తలపై తాజా ఇంటర్వ్యూలో భాగంగా సోనాలీకి ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘‘ఎవరు.. నేనా? నాకు తెలియదు. దీని గురించి మీరే చెప్పాలి. మీరు మాట్లాడే విషయం గురించి నాకు తెలియదు. నేను వినలేదు కూడా. ఇది తప్పుడు వార్త అయి ఉంటుంది. లేదా ఇంకా నా వరకు రాకపోయి ఉండొచ్చు’’ అని బింద్రే బదులిచ్చింది. 

బింద్రే త్వరలో మొదలయ్యే ఒక టీవీ షోలో జర్నలిస్ట్ అమీనా ఖురేషి పాత్రను పోషిస్తోంది. సోనాలి బింద్రే గోల్డీ బెహెల్ ను వివాహం చేసుకోగా, వీరికి 15 ఏళ్ల కుమారుడు రణవీర్ బెహెల్ కూడా ఉన్నాడు. 2018లో ఆమెకు మెటాస్టాటిక్ కేన్సర్ ఉన్నట్టు బయటపడగా.. చికిత్స తీసుకుని కేన్సర్ మహమ్మారిని బింద్రే అధిగమించింది. ఇందులో తన భర్త సహకారం ఎంతో ఉన్నట్టు ఆమె లోగడ చెప్పింది.
Sonali Bendre
Jr NTR
Movie
Koratala Siva

More Telugu News