Dr K. Laxman: తెలంగాణ బీజేపీ నేత కె.లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు

  • ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపుతున్న బీజేపీ 
  • నామినేషన్లకు నేడు చివరి రోజు
  • గత రాత్రి నలుగురు అభ్యర్థుల పేర్లతో జాబితా విడుదల
  • వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం
Telangana BJP leader Dr K Laxman nominated for Rajya Sabha from Uttar Pradesh

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఆ పార్టీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ కె.లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపబోతోంది. నామినేషన్లకు నేడు చివరి రోజు కావడంతో గత రాత్రి ఆయన పేరును ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేస్తోంది. 

ఈ మేరకు గత రాత్రి నలుగురు అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది.. మధ్యప్రదేశ్ నుంచి సుమిత్రా వాల్మీకి, కర్ణాటక నుంచి లహర్ సింగ్ సిరోయ, ఉత్తరప్రదేశ్ నుంచి మిథిలేష్ కుమార్, తెలంగాణ నుంచి డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్లను ప్రకటించింది.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావులు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నా, తెలంగాణ నుంచి పెద్దల సభలో బీజేపీకి ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డాక్టర్ కె.లక్ష్మణ్ తెలంగాణ బీజేపీ చీఫ్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 

ఇక గత ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. లక్ష్మణ్ స్థానంలో బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్షుడిని చేసిన తర్వాత ఆయనకు ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్ష పదవి ఇచ్చారు. కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు వెళ్తున్న తొలి వ్యక్తిగా లక్ష్మణ్ రికార్డులకెక్కనున్నారు.

More Telugu News