Hardik Pandya: నాడు ఇతడేం కెప్టెన్ అన్నారు... ఇప్పుడు టీమిండియా భవిష్యత్ కెప్టెన్ ఇతడేనంటున్నారు!

  • ఐపీఎల్ లో కొత్త జట్టుగా అడుగిడిన గుజరాత్ టైటాన్స్
  • హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో అద్భుతం
  • ఏకంగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన వైనం
  • పాండ్యా నాయకత్వంపై ప్రశంసల వర్షం
All praises Hardik Pandya for his leadership qualities

ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. టోర్నీలో అరంగేట్రం చేసిన ఏడాదే టైటిల్ చేజిక్కించుకుని ఔరా అనిపించింది. ఈ విజయంలో ప్రధానపాత్ర కెప్టెన్ హార్దిక్ పాండ్యాదే. ఫిట్ నెస్ సమస్యలు, ఫామ్ నేపథ్యంలో టీమిండియాలో చోటే ప్రశ్నార్థకమైన వేళ, హార్దిక్ పాండ్యా ఐపీఎల్ లో కొత్త జట్టయిన గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా నియమితుడయ్యాడు. 

అయితే, అప్పటి పరిస్థితుల్లో పాండ్యాను, అది కూడా ఓ కొత్త జట్టుకు కెప్టెన్ గా నియమించడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇతడేం కెప్టెన్ అంటూ చాలామంది పెదవి విరిచారు. హేమాహేమీ జట్లున్న టోర్నీలో గుజరాత్ టైటాన్స్ ఎలా నెగ్గుకొస్తుందో అని సందేహించిన వారున్నారు. కానీ అదంతా గతం. 

గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు ఐపీఎల్ విజేత. 15వ సీజన్ లో లీగ్ దశలో టేబుల్ టాపర్ గా ఉన్న ఈ జట్టు... ప్లే ఆఫ్స్ లోనూ సత్తా చాటి ఏకంగా టైటిల్ ఎగరేసుకెళ్లింది. నిన్న జరిగిన ఫైనల్లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను చిత్తుచేసింది. 

గుజరాత్ టైటాన్స్ విజయప్రస్థానంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా పాత్ర ఎనలేనిది. బ్యాటింగ్, బౌలింగ్ లో ముందుండి నడిపిస్తూ మిగతా ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశాడు. టోర్నీ మొత్తమ్మీద 487 పరుగులు చేసి, 8 వికెట్లు తీశాడు. మైదానంలో ఫీల్డింగ్ మోహరింపులు, సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం, ఒత్తిడిలోనూ చురుగ్గా ఆలోచించడం పాండ్యా బలాలు. పాండ్యా ఆటతీరుపైనా, నాయకత్వ లక్షణాలపైనా ఎవరికైనా ఏ మూలో సందేహాలు ఉంటే నిన్నటితో అవి తొలగిపోయినట్టే భావించాలి. 

ఇప్పుడు, హార్దిక్ పాండ్యాను టీమిండియా భవిష్యత్ కెప్టెన్ గా కీర్తిస్తున్నారు. భారత జట్టుకు నాయకత్వం వహించగలిగే సత్తా పాండ్యాకు ఉందని కొనియాడుతున్నారు. మీలో నాయకత్వ లక్షణాలు ఉంటే ఆటోమేటిగ్గా జాతీయ జట్టు ద్వారాలు తెరుచుకుంటాయి అని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో జాతీయ జట్టుకు నాయకత్వం వహించగలిగే సామర్థ్యం పాండ్యాలో పుష్కలంగా ఉందని పేర్కొన్నారు. 

అటు, జూన్ చివర్లో ఐర్లాండ్ తో జరిగే రెండు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియాకు పాండ్యానే సారథ్యం వహిస్తాడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాండ్యాపై వివిధ జట్ల కోచ్ లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆర్సీబీ హెడ్ కోచ్ డానియెల్ వెట్టోరీ స్పందిస్తూ, కెప్టెన్సీ ఒత్తిడి పాండ్యా ఆటతీరుపై ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. నాయకత్వ బాధ్యతలను ఎంతో సునాయాసంగా నిర్వర్తించాడని అభినందించారు.

More Telugu News