Andhra Pradesh: సాగ‌ర్ బ్యాక్ వాట‌ర్‌లో తెలుగు రాష్ట్రాల మ‌త్స్య‌కారుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌...రాళ్లు రువ్వుకున్న వైనం

  • రింగ్ వ‌ల‌ల‌తో వెళ్లిన ఏపీ మ‌త్స్య‌కారులు
  • ఆ వ‌ల‌లతో వేట వ‌ద్ద‌న్న తెలంగాణ మ‌త్స్య‌కారులు
  • ఘ‌ర్ష‌ణ‌లో ఏపీకి చెందిన మ‌త్స్య‌కారుల‌కు గాయాలు
  • ఆరుగురు ఏపీ మ‌త్స్య‌కారుల‌ను అప‌హ‌రించిన తెలంగాణ మ‌త్స్య‌కారులు
  • వారిని విడిపించిన ఏపీ పోలీసులు
clash between ap and telangana fishermen at nagarjuna sagar back water

తెలుగు రాష్ట్రాల‌కు చెందిన మ‌త్స్య‌కారుల మ‌ధ్య సోమ‌వారం పెద్ద గొడ‌వే జ‌రిగింది. నాగార్జున సాగ‌ర్ బ్యాక్ వాట‌ర్‌లో చేప‌లు ప‌ట్టే విష‌యంలో జ‌రిగిన వాదులాట ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. ఈ క్ర‌మంలో ప‌ర‌స్ప‌రం రాళ్లు రువ్వుకుని ఇరు రాష్ట్రాల మ‌త్స్య‌కారులు దాడులు చేసుకున్నారు. సాగ‌ర్ బ్యాక్ వాట‌ర్ ప‌రిధిలో రెండు రాష్ట్రాల స‌రిహ‌ద్దు ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

సాగ‌ర్ బ్యాక్ వాట‌ర్‌లో ఇరు రాష్ట్రాల‌కు చెందిన మ‌త్స్య‌కారులు చాలా కాలంగా చేప‌లు ప‌ట్టుకుంటున్నారు. ఈ క్ర‌మంలో సోమ‌వారం రింగ్ వ‌ల‌ల‌తో వేట‌కు వెళ్లేందుకు య‌త్నించిన ఏపీ మ‌త్స్య‌కారుల‌ను తెలంగాణ మ‌త్స్య‌కారులు అడ్డుకున్నారు. రింగ్ వ‌ల‌ల‌తో వేట సాగించ‌వ‌ద్ద‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా ఇరు వ‌ర్గాల మ‌ధ్య మాటా మాటా పెరిగి ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఇరు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం రాళ్ల‌తో దాడులు చేసుకున్నారు. 

ఈ దాడుల్లో ఏపీకి చెందిన ప‌లువురు మ‌త్స్య‌కారుల‌కు గాయాలు అయ్యాయి. అదే స‌మ‌యంలో ఏపీకి చెందిన ఆరుగురు మ‌త్స్య‌కారులను తెలంగాణ మత్స్యకారులు న‌ల్గొండ జిల్లా చందంపేట‌కు తీసుకెళ్లిపోయారు. స‌మాచారం అందుకున్న ఏపీ పోలీసులు అక్క‌డికి వెళ్లి ఏపీ మ‌త్స్య‌కారుల‌ను విడిపించుకుని వ‌చ్చారు. పోలీసుల ఎంట్రీతో ఇరు వ‌ర్గాలు శాంతించాయి.

More Telugu News