అమ్మ ఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు అంటూ దుష్ప్రచారం... స్పందించిన ఏపీ ప్రభుత్వం

30-05-2022 Mon 16:52 | Andhra
  • సోషల్ మీడియాలో దుష్ప్రచారం
  • ఓ నకిలీ ప్రెస్ నోట్ వైరల్
  • ఖండించిన ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం
  • చర్యలు తీసుకుంటామని వెల్లడి
AP Govt responds to fake press note
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఓ ప్రెస్ నోట్ పట్ల ఏపీ ప్రభుత్వం స్పందించింది. 2022 ఏడాదికి గాను అమ్మ ఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు చేస్తున్నారంటూ ఈ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారని, కానీ అందులో వాస్తవం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాము ఏ పథకాన్నీ రద్దు చేయడంలేదని, అది నకిలీ ప్రెస్ నోట్ అని వెల్లడించింది. 

కొన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ మేరకు తప్పుడు ప్రచారం జరుగుతోందని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం వివరణ ఇచ్చింది. ఇలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పేర్కొంది. ఈ తరహా దుష్ప్రచారంపై తాము సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం అందించినట్టు తెలిపింది. అధికారికంగా దీనిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అంతేకాదు, సదరు నకిలీ ప్రెస్ నోట్ ను కూడా ఫ్యాక్ట్ చెక్ విభాగం పంచుకుంది.