Bollywood: అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే గంజాయి అలవాటైంది: ఆర్యన్ ఖాన్

Consumed ganja in US for relief from sleeping disorder says Aryan Khan to NCB in charge sheet
  • ఎన్‌సీబీ ఎదుట అంగీకరించిన ఆర్యన్‌ఖాన్
  • నిద్ర సమస్య వల్లే అలవాటు చేసుకున్నానన్న ఆర్యన్
  • 6 వేల పేజీల చార్జ్‌షీట్‌లో పేర్కొన్న ఎన్‌సీబీ
  • ముంబైలోని ఓ డ్రగ్ డీలర్ తనకు తెలుసన్న షారూక్ తనయుడు
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఇటీవలే క్లీన్‌చిట్ పొందిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (NCB) ఎదుట సంచలన విషయాలు బయటపెట్టాడు. ఆర్యన్ అమెరికాలో ఉండగానే గంజాయి తాగడాన్ని అలవాటు చేసుకున్నాడని, ఈ విషయాన్ని స్వయంగా తమతో చెప్పాడని 6 వేల పేజీల చార్జ్‌షీట్‌లో ఎన్సీబీ పేర్కొంది. 

నిద్ర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కోసమే గంజాయి తీసుకునేవాడినని చెప్పాడని పేర్కొంది. క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసులో చిక్కిన ఆర్యన్ ఖాన్‌ సహా మరో ఐదుగురికి ఇటీవల ఎన్‌సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. మరో 14 మందిపై మాత్రం 6 వేల పేజీల చార్జ్‌షీట్ తయారుచేసింది. ఆర్యన్ ఖాన్, ఇతరులు ఇచ్చిన వివరాలతోపాటు దర్యాప్తులో గుర్తించిన అంశాలను అందులో పొందుపరిచింది. 

దాని ప్రకారం.. ఆర్యన్ ఖాన్ 2018లో అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే గంజాయి అలవాటు చేసుకున్నాడు. నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆర్యన్.. గంజాయి తాగడం ద్వారా వాటి నుంచి బయటపడొచ్చని ఇంటర్నెట్‌ ద్వారా తెలుసుకున్నాక దానికి అలవాటు పడ్డాడు. అలాగే, లాస్‌ఏంజెలెస్‌లో సరదా కోసం మారిజువానా తీసుకున్నట్టు అంగీకరించాడు. ముంబైకి చెందిన ఓ డ్రగ్ డీలర్ తనకు తెలుసని, కానీ అతడి ఊరు, పేరు తనకు తెలియదని ఆర్యన్ పేర్కొన్నాడు. 

కాగా, విచారణ సందర్భంగా ఆర్యన్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆరు గ్రాముల చరస్‌ (గంజాయి నుంచి తయారుచేస్తారు) ను ఆయన వినియోగించలేదని ఈ కేసులో మరో నిందితుడైన అర్బాజ్ చెప్పినట్టు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. నౌకలోకి డ్రగ్స్ తీసుకురావొద్దని ఆర్యన్ తనను హెచ్చరించినట్టు కూడా అర్బాజ్ చెప్పాడని చార్జ్‌షీట్‌లో ఎన్‌సీబీ పేర్కొంది.
Bollywood
Aryan Khan
Ganja
Shah Rukh Khan
NCB

More Telugu News