Southwest Monsoons: కేరళను తాకిన రుతుపవనాలు.. మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు..!

  • అంచనా వేసినట్టు ముందుగానే తాకిన నైరుతి
  • క్రమంగా విస్తరించనున్న రుతుపవనాలు
  • జూన్ తొలి వారంలో ఏపీలోని రాయలసీమను తాకుతాయంటున్న అధికారులు
Southwest monsoons Hits Kerala

ఎండలతో అల్లాడిపోతున్న జనానికి ఇది శుభవార్తే. వాతావరణశాఖ చెప్పినట్టు ఈ ఏడాది రుతుపవనాలు ముందే వచ్చేశాయి. ప్రతి సంవత్సరం జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు ఈసారి మూడు రోజుల ముందుగా నిన్ననే అడుగుపెట్టాయి. 

దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌లోని మిగిలిన ప్రాంతాలు, దక్షిణ తమిళనాడు, గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా ఇవి విస్తరించినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. వచ్చే మూడు నాలుగు రోజుల్లో కేరళలోని మిగిలిన ప్రాంతాలు, మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంలో పలు ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోకి రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు.

అలాగే, మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలను కూడా రుతుపవనాలు తాకుతాయన్నారు. నిజానికి ఈ నెల 27వ తేదీనే రుతుపవనాలు కేరళను తాకుతాయని అంచనా వేసినప్పటికీ అరేబియా సముద్రంలో పడమర గాలులు అనుకూలంగా లేకపోవడంతో వాటి రాక ఆలస్యమైంది. అరేబియా సముద్రం నుంచి పడమర దిశగా గాలులు 25 నుంచి 35 కి.మీ. వేగంతో కేరళపైకి వీస్తుండడంతో రుతుపవనాల రాకను వాతావరణ శాఖ నిర్ధారించింది. వాతావరణం అనుకూలిస్తే జూన్ తొలి వారంలో ఏపీలోని రాయలసీమను తొలుత రుతుపవనాలు తాకుతాయని అధికారులు చెబుతున్నారు. అలాగే, ఈ ఏడాది నైరుతి సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

More Telugu News