ఇరాక్‌ను భయపెడుతున్న కాంగో ఫీవర్.. ముక్కు నుంచి రక్తం కారి మరణిస్తున్న బాధితులు!

30-05-2022 Mon 06:35
  • ఇరాక్‌లో 1979లో తొలిసారి వెలుగులోకి కాంగో ఫీవర్
  • జంతువుల నుంచి మానవులకు సోకుతున్న వైనం
  • పశువులపై క్రిమిసంహారకాలు పిచికారీ చేస్తున్న అధికారులు
Iraq seeing outbreak of nose bleed fever
ప్రాణాంతక కాంగో ఫీవర్‌తో ఇరాక్ వణుకుతోంది. దేశంలో ఇటీవల ఈ కేసులు భారీగా వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ ఈ ఏడాది ఇప్పటి వరకు 19 మంది కాంగో ఫీవర్ బారినపడి మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెబుతోంది. జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తున్న ఈ కాంగో ఫీవర్ సోకితే జ్వరం, ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలతో మరణిస్తారు. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు.

నైరో వైరస్ అని పిలిచే క్రిమియన్-కాంగో హోమోరేజిక్ ఫీవర్ (CCHF) అనే రక్తం పీల్చే పేలు (Tick Bite) ద్వారా కాంగో ఫీవర్ జంతువుల నుంచి మానవులకు సోకుతోంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల మలం, రక్తం, చెమట కణాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇరాక్‌లో 1979లో తొలిసారి ఈ వైరస్ వెలుగు చూసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కరోనా కారణంగా పశువుల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయకపోవడం, గ్లోబల్ వార్మింగ్ వంటివి ఈ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నట్టు డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తోంది.