Crypto Currency: క్రిప్టో కరెన్సీ ఉచ్చులో చిక్కుకుని రూ.1.57 కోట్లు పోగొట్టుకున్న ముంబయి వాసి

  • అధిక లాభాలకు ఆశపడిన వ్యక్తి
  • ఓ వ్యక్తి ప్రోద్బలంతో ఆన్ లైన్ లో పెట్టుబడులు
  • నగదు విత్ డ్రాకు నిరాకరించిన నిందితుడు
  • వెబ్ సైట్ కూడా ఫేక్ అని తేలిన వైనం
  • లబోదిబోమన్న బాధితుడు
Mumbai man loses huge amount through fake crypto website

అధిక లాభాలకు ఆశపడి ఓ వ్యక్తి క్రిప్టో కరెన్సీ ఉచ్చులో చిక్కుకుని కోట్లు నష్టపోయాడు. ముంబయిలోని నేపియన్ సీ ప్రాంతంలో నివసించే ఆ 36 ఏళ్ల వ్యక్తి క్రిప్టో కరెన్సీ వెబ్ సైట్లో పెట్టుబడులు పెట్టాడు. అయితే అది నకిలీ వెబ్ సైట్ కావడంతో, లాభాలు కాదు కదా, అసలు కూడా గల్లంతైంది. ఈ స్కాంలో అతడు రూ.1.57 కోట్లు పోగొట్టుకున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి ముంబయి మలబార్ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఓ వ్యక్తి తనకు 2021 అక్టోబరులో ఆన్ లైన్ లో పరిచయం అయ్యాడని, క్రిప్టో మైనింగ్ హార్డ్ వేర్ లో పెట్టుబడి పెట్టాలని తనను ప్రోత్సహించాడని బాధితుడు వెల్లడించాడు. USD Miner అనే వెబ్ సైట్ ద్వారా పెట్టుబడులు పెట్టాలని సూచించాడని, ఎంతో డబ్బు సంపాదించుకోవచ్చని నమ్మబలికాడని వివరించాడు. 

లాభాలు వస్తున్నట్టు కనిపించడంతో, తాను నగదు విత్ డ్రా చేసుకుంటానంటే, ఆ వ్యక్తి అంగీకరించేవాడు కాదని, చివరికి అతడి ఫోన్ స్విచాఫ్ కావడంతో తాను మోసపోయిన విషయం అర్థమైందని బాధితుడు వాపోయాడు. అంతేకాదు, తాను పెట్టుబడులు పెట్టిన వెబ్ సైట్ కూడా నకిలీదని తేలడంతో చేసేదిలేక పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపాడు.

More Telugu News