BJP: ఇలాంటి నేత‌లూ ఉంటారు!... రాజ్య‌స‌భ సీటు వ‌ద్ద‌న్న బీజేపీ క‌ర్ణాట‌క నేత‌!

  • బీజేపీ క‌ర్ణాట‌క శాఖ ఉపాధ్య‌క్షుడిగా సురానా
  • రాజ్య‌స‌భ సీటుకు ఆయ‌న పేరును ప్ర‌తిపాదించిన పార్టీ
  • రాజ్య‌సభ సీటు త‌న‌కు వ‌ద్దంటూ జేపీ న‌ద్దాకు లేఖ‌
  • పార్టీ బాధ్య‌త‌ల‌తోనే స‌రిపోతోంద‌ని వెల్ల‌డి
bjp karnataka vice president rejects rajyasabha seat

రాజ‌కీయాలంటేనే అవ‌కాశాల‌ను వెతుక్కుంటూ వెళ్ల‌డం.. వేరెవరికో అందే అవ‌కాశాన్ని లాగేసుకోవ‌డం.. అందిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని మ‌రింత ఉన్న‌త స్థితికి ఎద‌గడం. మ‌రి సీటిస్తామ‌ని చెప్పిన పార్టీతో త‌న‌కు సీటే వ‌ద్దన్న నేత‌లు మ‌న‌కు ఎప్పుడైనా క‌నిపించారా?  లేదు క‌దా. అయితే కర్ణాట‌క‌కు చెందిన ఈ బీజేపీ నేత‌ను చూస్తే మాత్రం... ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఇలాంటి నేత‌లు కూడా ఉంటారా? అని నోరెళ్ల‌బెట్ట‌క త‌ప్ప‌దు. ఈయ‌న వ‌ద్ద‌న్న సీటు ఐదేళ్ల ప‌ద‌వీ కాల‌మున్న ఎంపీ సీటో, ఎమ్మెల్యే సీటో కాదు.. ఆరేళ్ల ప‌దవీ కాలం ఉండే రాజ్య‌స‌భ సీటు. మ‌రి ఈ నేత వివ‌రాల్లోకెళ్లిపోదాం ప‌దండి.

బీజేపీ క‌ర్ణాట‌క శాఖ‌కు ఉపాధ్య‌క్షుడిగా నిర్మ‌ల్ కుమార్ సురానా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాజ‌కీయాల్లోకి రాక‌ముందే స‌త్తా క‌లిగిన పారిశ్రామిక‌వేత్త‌గానూ త‌న‌ను తాను నిరూపించుకున్నారు. ఏళ్ల త‌ర‌బ‌డి పార్టీకి సేవ‌లు అందిస్తున్న సురానాకు ఏదో ఒక అవ‌కాశం క‌ల్పించాల‌ని భావించిన బీజేపీ రాష్ట్ర శాఖ తాజాగా త‌న‌కు ద‌క్క‌నున్న రాజ్య‌స‌భ సీటుకు సురానా పేరును ప్ర‌తిపాదించింది. సురానాతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పేరును కూడా క‌ర్ణాట‌క బీజేపీ ప్ర‌తిపాదించింది. మొన్న‌టిదాకా క‌ర్ణాట‌క కోటా నుంచే రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా కొన‌సాగుతున్న నిర్మ‌ల‌ను ఈ ద‌ఫా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి ఎంపిక చేయాల‌ని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంద‌ట‌. వెర‌సి అందుబాటులో ఉన్న ఒక్క రాజ్య‌స‌భ సీటుకు సురానా ఒక్క‌రే బ‌రిలో ఉన్న‌ట్లు. ఆయ‌న ఎంపిక లాంఛ‌న‌మే క‌దా.

ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌ద్దాకు సురానా లేఖ రాశారు. త‌న‌కు రాజ్య‌స‌భ సీటు వ‌ద్దంటూ స‌ద‌రు లేఖ‌లో ఆయ‌న కోరారు. ఇందుకు గ‌ల కార‌ణాన్ని కూడా సురానా వెల్ల‌డించారు. ప్రస్తుతం పార్టీలో తాను నిర్వ‌ర్తిస్తున్న బాధ్య‌త‌ల‌తోనే త‌న‌కు స‌రిపోతోంద‌ని, ఈ బాధ్య‌త‌ల‌కు అద‌నంగా మ‌రే బాధ్య‌త ఇచ్చినా మోయ‌లేనంటూ సురానా తేల్చి పారేశార‌ట‌. చేతికందుతున్న బంగారం లాంటి అవ‌కాశాన్ని వ‌ద్దంటున్న సురానాను చూసి ఆయ‌న సొంత పార్టీ నేత‌లే ఆశ్చ‌ర్య‌పోతున్నార‌ట‌.

More Telugu News