మహానాడు నేపథ్యంలో విజయసాయిరెడ్డి విమర్శల పర్వం

28-05-2022 Sat 21:30
  • ఒంగోలులో టీడీపీ మహానాడు
  • చంద్రబాబును టార్గెట్ చేసిన విజయసాయి
  • చంద్రబాబు ఓ ఉన్మాది అని వ్యాఖ్యలు
  • బస్సు యాత్రతో విపక్షాలకు వణుకు పుడుతోందని విమర్శలు
Vijayasai Reddy comments on Chandrababu
ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహించిన నేపథ్యంలో, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ప్రతి మహానాడులో ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వమని అధికారికంగా అడగకుండానే అడిగినట్టు నటిస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబును ఉన్మాది అని అభివర్ణించారు. 

పసుపు-కుంకుమ పేరుతో తాయిలాలు ఇస్తే ఎన్నికల్లో గెలుస్తానని భ్రమపడ్డాడని విమర్శించారు. 2019 ఎన్నికలకు రెండ్రోజుల ముందు రూ.5 వేల కోట్ల అప్పు చేశాడని, రోడ్ల కోసమని రహదారుల అభివృద్ధి సంస్థను తనఖా పెట్టి రూ.3 వేల కోట్లు తెచ్చాడని విజయసాయి ఆరోపించారు. ఎన్ని పంచినా ఉప్పు, కారం రాశారని, ఇప్పటికీ ఆ మంట తగ్గినట్టు లేదని ఎద్దేవా చేశారు. కాగా, తమ సామాజిక న్యాయభేరి బస్సు యాత్రతో విపక్షాలకు వణుకు పుడుతోందని విజయసాయిరెడ్డి అన్నారు.