రేవంత్ రెడ్డిపై వైఎస్సార్టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ఘాటు విమ‌ర్శ‌లు

28-05-2022 Sat 20:36
  • రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిల‌ర్‌, దొంగ‌ అన్న షర్మిల 
  • ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ‌ అంటూ విమర్శలు 
  • రేవంత్ కుల రాజ‌కీయాలు చేస్తున్నార‌న్న ష‌ర్మిల‌
ysrtp chief ys sharmila fires on revanth reddy
తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ (టీపీసీసీ) అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై వైఎస్సార్టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ఘాటు విమ‌ర్శ‌లు గుప్పించారు. రేవంత్ రెడ్డిని ఓ బ్లాక్ మెయిల‌ర్‌గానే కాకుండా ఓ దొంగగా అభివ‌ర్ణించిన ష‌ర్మిల‌... ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అంటూ ఆయ‌న‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. 

రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాట‌లు ఇత‌ర కులాల‌ను కించ‌ప‌రిచేవిలా ఉన్నాయ‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రెడ్డి సామాజిక వ‌ర్గానికి మాత్ర‌మే అధికారం ఇవ్వాల‌న్న దిశ‌గా ఇటీవ‌లే రేవంత్ రెడ్ది చేసిన వ్యాఖ్య‌ల‌పై శ‌నివారం వైఎస్ ష‌ర్మిల స్పందించారు. రెడ్డి సామాజిక వ‌ర్గానికే అధికార ప‌గ్గాలు క‌ట్ట‌బెట్టాలంటే...ఇత‌ర సామాజిక వ‌ర్గాల వారిని కించ‌ప‌రిచిన‌ట్లే క‌దా అంటూ ష‌ర్మిల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇలా కుల రాజ‌కీయాలు చేస్తుంటే.. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ ఏమైనా చ‌ర్య‌లు తీసుకుందా? అని ఆమె ప్ర‌శ్నించారు. గొప్ప నాయ‌కుడు కావాలంటే కులం అవ‌స‌రం లేద‌న్న ష‌ర్మిల‌... మంచి మ‌న‌సుండాల‌ని, విశ్వ‌స‌నీయ‌త ఉండాల‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే త‌ప‌న‌, గుండెల్లో నిజాయ‌తీ ఉంటే గొప్ప నేత‌లు అవుతార‌ని ఆమె చెప్పారు. ఈ ల‌క్ష‌ణాల వ‌ల్లే త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గొప్ప నేత‌గా ఎదిగార‌ని ష‌ర్మిల అన్నారు.