తెలంగాణ‌లో ఎగిరేది బీజేపీ జెండానే: ఈట‌ల రాజేంద‌ర్‌

28-05-2022 Sat 20:13
  • కాంగ్రెస్ దీపం ఢిల్లీలోనే ఆరిపోయిందన్న ఈటల 
  • తెలంగాణ‌లో ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌ సాగుతోందని విమర్శ 
  • నేనే రాజు నేనే మంత్రి, నేనే సీఎం అనుకుంటున్నార‌న్న ఈట‌ల‌
bjp mla etela rajender comments on trs and congress party
వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ఎగిరేది బీజేపీ జెండానేన‌ని మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఈ మేర‌కు శ‌నివారం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన సంద‌ర్భంగా టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీపైనా ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ దీపం ఢిల్లీలోనే ఆరిపోయింద‌న్న ఈట‌ల...తెలంగాణ హ‌స్తం పార్టీకి గెలిచే అవ‌కాశ‌మే లేద‌ని తేల్చేశారు. అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌ను ఎవ‌రూ న‌మ్మ‌డం లేద‌ని చెప్పిన ఈట‌ల‌... వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ రెండు పార్టీల‌కు ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌న్నారు. 

ప్ర‌స్తుతం తెలంగాణలో సాగుతున్న‌ది ప్ర‌జా కంట‌క‌, ప్ర‌జా వ్య‌తిరేక పాల‌నేన‌ని, దానిపై బీజేపీ కొట్టాడుతోంద‌ని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. తెలంగాణ‌లో నేనే రాజు, నేనే మంత్రి, నేనే సీఎం అనుకుంటూ తామేం చేసినా చెల్లుబాటు అవుతుంద‌ని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ త‌ర‌హా పాల‌న అంతం కావాలంటే రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగ‌రాల్సిందేన‌ని ఈట‌ల చెప్పారు.