నా గుండె బద్దలయింది: టెన్నిస్ స్టార్ జకోవిచ్

28-05-2022 Sat 16:02
  • దివాలా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బోరిస్ బెకర్
  • బెకర్ ను ఇలా చూడటం చాలా బాధగా ఉందన్న జకోవిచ్
  • బెకర్ కొడుకు నోవాతో టచ్ లో ఉన్నానని వెల్లడి
My heart broken says Novak Djokovic to see Boris Becker in prison
జర్మన్ టెన్నిస్ దిగ్గజం, ఆరు గ్రాండ్ స్లామ్ ల విజేత బోరిస్ బెకర్ ప్రస్తుతం ఊచలు లెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దివాలా కేసులో ఆయనకు కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్షను విధించింది. బెకర్ జైలు జీవితంపై సెర్బియా టెన్నిస్ స్టార్ జకోవిచ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన గుండె బద్దలయిందని వ్యాఖ్యానించాడు. బెకర్ ను ఇలా చూడటం చాలా బాధగా ఉందని అన్నాడు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించాడు. 

తనకు, తన కుటుంబానికి బెకర్ ఎంతో ఆప్తుడని జకోవిచ్ అన్నాడు. కొన్నేళ్ల పాటు ఇద్దరం కలిసి ఎంతో గొప్ప సమయాన్ని గడిపామని చెప్పాడు. జకోవిచ్ కు 2013 నుంచి 2017 వరకు బెకర్ హెడ్ కోచ్ గా వ్యవహరించిన సంగతి గమనార్హం. బెకర్ కుమారుల్లో ఒకడైన నోవాతో తాను టచ్ లో ఉన్నానని... ఏదైనా సాయం కావాల్సి వస్తే తాను చేస్తానని చెప్పానని జొకోవిచ్ తెలిపాడు. 

వచ్చే ఏడాది జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడాలని భావిస్తున్నట్టు జకోవిచ్ చెప్పాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ లో జకోవిచ్ ఆడని సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో ఆయనను ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆడనివ్వలేదు. దీనిపై ఆయన స్పందిస్తూ... తనను ఆడనివ్వకపోవడం పట్ల తనకు ఎలాంటి కోపం లేదని చెప్పాడు.