కొన్నాళ్లు పోతే ఎన్టీఆర్ అవతార పురుషుడు అవుతారు: లక్ష్మీపార్వతి

28-05-2022 Sat 15:28
  • రాముడిని, కృష్ణుడిని భూమి మీదకు తీసుకొచ్చిన దైవం ఎన్టీఆర్
  • రాముడు, కృష్ణుడు కూడా చనిపోయిన తర్వాతే దేవుళ్లయ్యారు
  • రాబోయే తరాలకు ఎన్టీఆర్ దేవుడిగా నిలిచిపోతారు
NTR will become as God for future generations says Lakshmi Parvati
తన భర్త, దివంగత ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన భార్య, ఏపీ తెలుగు, సంస్కృతం అకాడెమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి నివాళి అర్పించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన లక్ష్మీపార్వతి తన భర్త సమాధిపై పూలు చల్లి, నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, సమాజంలోని పేదలు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ తాపత్రయపడ్డారని చెప్పారు. మడమ తిప్పని నైజం ఆయన సొంతమని అన్నారు. ఒక మహా నటుడిగా ప్రపంచానికే ఖ్యాతి తీసుకొచ్చిన ఘనత, పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోయి రాముడిని, కృష్ణుడిని భూమి మీదకు తీసుకొచ్చిన దైవం ఎన్టీఆర్ అని కొనియాడారు. 

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ గారి వ్యక్తిత్వం, ఆయన రూపం ఇంతవరకు ఎవరికీ లభించనటువంటి అపురూపమైన వ్యక్తి అని లక్ష్మీపార్వతి అన్నారు. కొన్నాళ్లు పోతే ఆయన కూడా ఒక అవతార పురుషుడు అవుతారని... ఆనాడు రాముడు, కృష్ణుడు ఉన్నప్పుడు కూడా వాళ్లను ఎవరూ కూడా దేవుళ్లుగా గుర్తించలేదని... వాళ్లు చనిపోయిన తర్వాతే దేవుళ్లయ్యారని చెప్పారు. అదే విధంగా రాబోయే తరాలకు ఎన్టీఆర్ కూడా ఒక దేవుడిగా నిలిచిపోతారని అన్నారు.