స్పందించ‌మ‌న్నా ప‌ట్టించుకోవ‌ట్లేదు!.. బీజేపీ అధికార ప్ర‌తినిధుల‌పై బండి సంజ‌య్ ఆగ్ర‌హం

27-05-2022 Fri 20:52
  • 9 మంది అధికార ప్ర‌తినిధులున్నా లాభం లేదన్న సంజయ్ 
  • అధికార ప్ర‌తినిధులు చేయాల్సిన ప‌నులు చేయ‌ట్లేదని విమర్శ 
  • ఇక‌పై రోజూ ఓ అధికార ప్ర‌తినిధి కార్యాల‌యంలో ఉండాల్సిందేన‌న్న సంజ‌య్‌
bjp telangana chief bandi sanjay anger over party spokes persons
బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధుల‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. పార్టీలో ఇక్కడ 9 మంది అధికార ప్ర‌తినిధులున్నా... పార్టీకి ఆశించిన మేర ప‌ని చేయ‌డం లేద‌ని ఆయ‌న ఆగ్ర‌హించారు. అధికార ప్ర‌తినిధులుగా చేయాల్సిన ప‌నుల‌ను వారు చేయ‌డం లేద‌ని కూడా ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్‌గా ఉండాల‌ని చెబుతున్నా.. ఆ మేర‌కు అధికార ప్ర‌తినిధుల నుంచి స్పంద‌న లేద‌ని ఆయ‌న అన్నారు.

ఇక‌పై అలా కుద‌ర‌ద‌ని చెప్పిన బండి సంజ‌య్‌.. ఇక‌పై ప్ర‌తి రోజు అధికార ప్ర‌తినిధుల్లో ఒక‌రు పార్టీ కార్యాల‌యంలో ఉండాల్సిందేన‌ని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో జ‌రిగే ఘ‌ట‌న‌ల‌పై నేత‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ పార్టీ లైన‌ప్‌ను వారికి వివ‌రించాల‌ని ఆయ‌న అధికార ప్ర‌తినిధుల‌కు దిశానిర్దేశం చేశారు.