భారత్ లో కాలుమోపిన హంగేరీ ద్విచక్రవాహనాల సంస్థ.. ఈ స్కూటర్లు కాస్త ఖరీదే గురూ!

27-05-2022 Fri 19:55
  • భారత్ లో ఎంట్రీ ఇచ్చిన కీవే 
  • ప్రస్తుతానికి రెండు మోడళ్లతో రంగప్రవేశం
  • స్కూటర్ల ప్రారంభ ధర రూ.2.99 లక్షలు
  • భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం
Hungary firm Keeway enters into Indian market with two scooters
ప్రపంచంలో ఏ వాణిజ్య సంస్థకైనా భారత్ ఓ ఆకర్షణీయ విపణి అనడంలో ఎలాంటి సందేహంలేదు. అన్ని వర్గాల ప్రజలు ఉండే భారత్ లో తమ ఉత్పత్తుల అమ్మకానికి తగిన గ్యారంటీ ఉంటుందని ఆయా సంస్థల నమ్మకం. ఇదే నమ్మకంతో తాజాగా హంగేరీకి చెందిన కీవే సంస్థ భారత్ లో రంగప్రవేశం చేసింది. 

స్కూటర్ల విభాగంలో రెండు మోడళ్లను భారతీయులకు పరిచయం చేయనుంది. సిక్ట్సీస్ 300ఐ, వీస్టే 300 అనే మోడళ్లను లాంఛనంగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.2.99 లక్షలు (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభం అవుతాయి. అయితే, భవిష్యత్తులో ఈ ధరలు పెంచవచ్చని తెలుస్తోంది. ఈ రెండు మోడళ్ల స్కూటర్లను జూన్ నుంచి కొనుగోలుదారులకు డెలివరీ ఇవ్వనున్నారు. 

హంగేరీకి చెందిన కీవే చైనాకు చెందిన కియాన్ జియాంగ్ మోటార్ సైకిల్స్ గ్రూప్ అనుబంధ సంస్థ. కియాన్ జియాంగ్ ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ బైక్ బ్రాండ్ బెనెల్లీని  కూడా సొంతం చేసుకుంది. కాగా, కీవే భారత్ లో ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అంతేకాదు, తన సోదర సంస్థ బెనెల్లీకి భారత్ లో ఉన్న 40కి పైగా డీలర్ షిప్ పాయింట్లను, అసెంబ్లింగ్ యూనిట్ ను కీవే వినియోగించుకోనుంది.