Andhra Pradesh: ఈ నెల 31న చ‌మురు కంపెనీల‌ నుంచి కొనుగోళ్ల నిలిపివేత‌: ఏపీ పెట్రోలియం డీల‌ర్ల ప్ర‌క‌ట‌న‌

  • విజ‌య‌వాడ‌లో ఏపీ పెట్రోలియం డీల‌ర్ల స‌మాఖ్య స‌మావేశం
  • 2017 నుంచి డీల‌ర్ల మార్జిన్‌లో మార్పులు లేవన్న సమాఖ్య 
  • అదే సమ‌యంలో ఎక్సైజ్ సుంకాన్ని3 సార్లు పెంచారని వ్యాఖ్య 
  • పైస‌ల్లో ధ‌ర‌లు పెంచి.. రూపాయ‌ల్లో ధ‌ర‌లు తగ్గిస్తున్నారని విమర్శ 
  • ఫ‌లితంగా డీల‌ర్ల‌కు భారీ న‌ష్ట‌మ‌న్న స‌మాఖ్య‌

ఏపీ పెట్రోలియం డీల‌ర్ల స‌మాఖ్య శుక్ర‌వారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 31న చ‌మురు కంపెనీల నుంచి పెట్రోలియం ఉత్ప‌త్తుల కొనుగోళ్ల‌ను నిలిపివేయ‌నున్న‌ట్లు ఆ సంఘం ప్ర‌క‌టించింది. అంత‌ర్జాతీయ మార్కెట్లో ముడి చ‌మురు ధ‌ర‌లు, వాటికి అనుగుణంగా దేశంలో పెట్రోలియం ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను మార్చ‌డం లేద‌న్న అంశంపై చర్చించేందుకు శుక్ర‌వారం విజ‌య‌వాడ‌లో పెట్రోలియం డీల‌ర్ల స‌మాఖ్య ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైంది. ఈ సంద‌ర్భంగానే ఈ నెల 31 నుంచి చ‌మురు కంపెనీల నుంచి కొనుగోళ్ల‌ను నిలిపివేయ‌నున్న‌ట్లుగా స‌మాఖ్య ప్ర‌క‌టించింది.

భేటీలో భాగంగా స‌మాఖ్య ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించింది. కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు చ‌మురు కంపెనీల నిర్ణ‌యాల‌తో డీల‌ర్ల‌కు భారీ న‌ష్టం వాటిల్లుతోంద‌ని స‌మాఖ్య ఆరోపించింది. క్రూడాయిల్ ధర‌ల‌కు అనుగుణంగా పెట్రోలియం ఉత్ప‌త్తుల ధ‌ర‌లు తగ్గించ‌డం లేద‌ని పేర్కొంది. చ‌మురు ధ‌ర‌లను పైస‌ల్లో పెంచుతున్నార‌ని, అదే స‌మ‌యంలో ధ‌ర‌లు త‌గ్గించిన‌ప్పుడు మాత్రం రూపాయ‌ల్లో తగ్గిస్తున్నార‌ని తెలిపింది. ఫ‌లితంగా డీల‌ర్ల‌కు భారీ న‌ష్టం వాటిల్లుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. 2017 నుంచి డీల‌ర్ల మార్జిన్‌లో ఎలాంటి మార్పులు లేవ‌న్న స‌మాఖ్య‌... ఎక్సైజ్ సుంకాన్ని మాత్రం మూడు సార్లు పెంచార‌ని ఆరోపించింది.

More Telugu News