ఐపీఎల్ క్వాలిఫయర్-2: బెంగళూరుపై టాస్ గెలిచిన రాజస్థాన్.. అందరి దృష్టి అతడిపైనే...!

27-05-2022 Fri 19:22
  • ముగింపు దశకు చేరిన ఐపీఎల్
  • నేడు రెండో క్వాలిఫయర్ మ్యాచ్
  • అహ్మదాబాద్ లో బెంగళూరు వర్సెస్ రాజస్థాన్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
RR won the toss in IPL Qualifier 2
ఐపీఎల్-15లో గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఫైనల్ చేరగా, టైటిల్ సమరంలో తలపడే మరో జట్టు ఏదో నేడు తేలనుంది. ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్ లో నేడు రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ చావోరేవో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్, బెంగళూరు జట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. 

ఈ మ్యాచ్ లో బెంగళూరు యువకిశోరం రజత్ పాటిదార్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో పాటిదార్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. బ్యాట్ తో వీరవిహారం చేసిన పాటిదార్ 54 బంతుల్లోనే 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 12 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. నేడు రాజస్థాన్ పైనా పాటిదార్ విరుచుకుపడాలని బెంగళూరు శిబిరం కోరుకుంటోంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు...
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హేజెల్ వుడ్, మహ్మద్ సిరాజ్.

రాజస్థాన్ రాయల్స్ జట్టు...
సంజు శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్ కాయ్, యజువేంద్ర చహల్.