ఇక మిగిలింది ఆ ఇద్దరు హీరోలే: అనిల్ రావిపూడి

27-05-2022 Fri 17:59
  • ఈ రోజున 'ఎఫ్ 3'ని థియేటర్లకు తీసుకొచ్చిన అనిల్ రావిపూడి
  • సీనియర్ స్టార్ హీరోలైన నలుగురితో చేయాలనుకున్నానంటూ వివరణ  
  • వెంకటేశ్ తో ముచ్చట తీరింది అంటూ వ్యాఖ్య 
  • బాలయ్యతో కోరిక నెరవేరుతుందంటూ హర్షం
  • త్వరలో చిరూ .. నాగ్ తోను చేస్తానంటూ హామీ  
F3 Movie update
అనిల్ రావిపూడి తాజా చిత్రమైన 'ఎఫ్ 3' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ఓపెనింగ్స్ తో ఈ సినిమా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇక అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను బాలకృష్ణతో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

 ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి తన ఆలోచనలను అభిమానులతో పంచుకున్నాడు."సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ గార్లతో సినిమాలు చేయాలని నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడే అనుకున్నాను. వెంకటేశ్ గారితో రెండు సినిమాలు చేసేశాను. త్వరలో బాలకృష్ణగారితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాను. 

ఇక మిగిలింది చిరంజీవి .. నాగార్జున. వాళ్లతో కూడా తప్పకుండా సినిమాలు చేస్తాను. ఇక పౌరాణికాల్లో  'మాయా బజార్' తరహా సినిమాను చేయాలనుంది. అలాగే 'జగదేకవీరుడు అతిలోక సుందరి' వంటి సోషియో ఫాంటసీ చేయాలని ఉంది. అలాంటి అవకాశం వస్తుందనే అనుకుంటున్నాను .. రావాలనే కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు. మరి ఆయన కోరిక ఎప్పుడు నెరవేరుతుందో .. ఏమిటో!