సూపర్ స్టార్ కృష్ణను ఇంటర్వ్యూ చేసిన కుమార్తె... ప్రోమో ఇదిగో!

27-05-2022 Fri 17:03
  • ఈ నెల 31న కృష్ణ పుట్టినరోజు
  • 79వ పుట్టినరోజు జరుపుకోనున్న సూపర్ స్టార్
  • తండ్రిని ఆసక్తికర ప్రశ్నలు అడిగిన మంజుల
  • ఓపిగ్గా సమాధానాలు చెప్పిన కృష్ణ
Manjula Ghattamaneni interviews her father Superstar Krishna
సూపర్ స్టార్ కృష్ణ ఈ నెల 31న 79వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో, కృష్ణను ఆయన కుమార్తె మంజుల ఘట్టమనేని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. కృష్ణ 57 ఏళ్ల సినీ ప్రస్థానంతో పాటు అనేక ఆసక్తికర అంశాలను మంజుల ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. "ఇప్పటికీ ఇలా మెరిసిపోతున్నారు ఏంటి నాన్నా? మీ స్కిన్ కలరేంటీ...?" అంటూ మంజుల ప్రశ్నించగా, "గాడ్స్ గిఫ్ట్" అంటూ కృష్ణ నవ్వుతూ బదులిచ్చారు. తాను ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటానని, పని ఉంటే తప్ప బయటికి వెళ్లనని స్పష్టం చేశారు. 

సినిమాలపై అనురక్తి గురించి చెబుతూ, తాను ఉద్యోగాలు చేయాలని అనుకోలేదని, ఎప్పటికైనా హీరో అవ్వాలన్నదే తన లక్ష్యంగా ఉండేదని కృష్ణ వెల్లడించారు. అందుకే ఉద్యోగాల జోలికే వెళ్లలేదని తెలిపారు. మొదట్లో అందరూ తనను ఓ లేత వయసులో ఉన్నవాడిగానే చూశారని వివరించారు. మహేశ్ బాబు గురించి చెబుతూ, చిన్నప్పుడు నటిస్తావా అని అడిగితే నటించనని చెప్పి స్టూడియో అంతా పరిగెత్తించాడని కృష్ణ గుర్తు చేసుకున్నారు. 

ఓ దశలో తనకు 12 ఫ్లాపులు వచ్చాయని, దాంతో తాను నటనకు పనికిరానంటూ తనతో సినిమా చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని వెల్లడించారు. ఆ సమయంలో 'పాడిపంటలు' చిత్రం సొంతంగా తీసి మళ్లీ హిట్ బాట పట్టినట్టు వివరించారు. కాగా, ఈ ప్రొమో వీడియోను మంజుల ఘట్టమనేని తన యూట్యూబ్ చానల్లో పంచుకున్నారు.