రూల్ ఫ‌ర్ ఆల్‌!.. మ‌హానాడు ప్రాంగ‌ణంలోకి రిజిస్ట్రేష‌న్‌తోనే చంద్ర‌బాబు ఎంట్రీ!

27-05-2022 Fri 16:57
  • ఒంగోలు వేదిక‌గా ప్రారంభ‌మైన టీడీపీ మ‌హానాడు
  • హాజ‌రైన పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు
  • సామాన్య కార్య‌క‌ర్త‌ల మాదిరే పేరు రిజిస్ట్రేష‌న్‌
  • పేరు రిజిస్ట‌ర్ త‌ర్వాతే మ‌హానాడు ప్రాంగ‌ణంలోకి ఎంట్రీ
chandrababu enters mahanadu after registers his name
ఏదేనీ ఓ నిబంధ‌న‌ను పెట్టుకుంటే... దానిని తు.చ త‌ప్ప‌కుండా పాటించే నేత‌ల్లో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ముందు వ‌రుస‌లో ఉంటారు. ఇందుకు నిద‌ర్శ‌నంగా ఒంగోలు కేంద్రంగా శుక్ర‌వారం మొద‌లైన టీడీపీ మ‌హానాడు వేడుక‌ల్లో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. మ‌హానాడు ప్రాంగ‌ణంలోకి ఎంట్రీ ఇచ్చే స‌మ‌యంలో టీడీపీ సాంకేతిక విభాగం ఏర్పాటు చేసిన న‌మోదు కేంద్రం వ‌ద్ద త‌న పేరును చంద్ర‌బాబు న‌మోదు చేయించుకున్నారు. ఆ త‌ర్వాతే ఆయ‌న మ‌హానాడు ప్రాంగ‌ణంలోకి అడుగుపెట్టారు.

స‌భ్య‌త్వం, రిజిస్ట్రేష‌న్ వంటి వాటి కోసం టీడీపీ అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మహానాడుకు వ‌చ్చే నేత‌ల పేర్ల‌ను కూడా టీడీపీ సిబ్బంది ఆన్‌లైన్‌లోనే రిజిస్ట‌ర్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్‌లో పొందుప‌రచిన ఓ యాప్ ద్వారా నేత‌లకు పార్టీ అందించిన ఐడెంటిటీ కార్డుల‌ను స్కాన్ చేయ‌డంతో రిజిస్ట్రేష‌న్ పూర్తి చేస్తున్నారు. చంద్ర‌బాబు వ‌చ్చిన సంద‌ర్భంగా ఓ మ‌హిళా కార్య‌కర్త ఆయ‌న ఐడీ కార్డును ప‌ట్టుకోగా.. మ‌రో కార్య‌క‌ర్త దానిని స్కాన్ చేశారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఓ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన టీడీపీ కార్య‌క‌ర్త చంద్ర‌బాబు నిబ‌ద్ధ‌త‌ను ప్ర‌స్తావించారు.