ఆదిలాబాద్ జిల్లాలో ప‌రువు హ‌త్య‌... కూతురు గొంతు కోసి చంపేసిన త‌ల్లిదండ్రులు

27-05-2022 Fri 16:22
  • నార్నూర్ మండ‌లం నాగ‌ల్ కొండ‌లో ఘ‌ట‌న‌
  • రాజేశ్వ‌రిని గొంతు కోసి చంపేసిన త‌ల్లిదండ్రులు
  • వేరే మ‌తానికి చెందిన యువ‌కుడితో ప్రేమే కార‌ణం
another honour killing in telangana
తెలంగాణ‌లో కేవ‌లం నెల వ్య‌వ‌ధిలోనే మూడు ప‌రువు హ‌త్య‌లు చోటుచేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండ‌లం నాగ‌ల్ కొండ‌లో రాజేశ్వ‌రి (20) అనే యువ‌తిని ఆమె త‌ల్లిదండ్రులే క‌త్తితో గొంతు కోసి మ‌రీ దారుణంగా హ‌త్య చేశారు. వేరే మ‌తానికి చెందిన యువ‌కుడిని ప్రేమిస్తోంద‌న్న కార‌ణంగానే ఆమెను త‌ల్లిదండ్రులు చంపేశారు. శుక్ర‌వారం తీవ్ర క‌ల‌క‌లం రేపిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే... హైద‌రాబాద్ ప‌రిధిలో ఇప్ప‌టికే రెండు ప‌రువు హ‌త్య‌లు చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. తొలుత నాగ‌రాజు అనే యువ‌కుడిని అత‌డు ప్రేమించి పెళ్లి చేసుకున్న ముస్లిం యువ‌తి సోద‌రుడు ప‌ట్ట ప‌గ‌లే న‌డిరోడ్డుపై దాడి హ‌త్య చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న మ‌రువ‌క ముందే పాత‌బ‌స్తీ ప‌రిధిలో గ‌తవారం నీరజ్ అనే యువకుడిని అతడి భార్య తరఫు బంధువులు బేగం బజార్ మచ్చి మార్కెట్‌లో హ‌త్య చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న తాజా ఘ‌ట‌న‌తో రాష్ట్రంలో ప‌రువు హ‌త్య‌ల సంఖ్య 3కు చేరుకుంది.