శరద్ పవార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటికి బెయిల్ నిరాకరణ

27-05-2022 Fri 15:50
  • సోషల్ మీడియాలో పోస్టు చేసిన నటి కేట్కీ చితాలే
  • మరాఠీ నటిపై పలు పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ లు
  • 2020 నాటి పాత కేసు కూడా బయటికి తీసిన పోలీసులు
  • ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు
Marathi actress Ketki Chitali was denied bail
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై మరాఠీ నటి కేట్కీ చితాలే సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అయితే, కేట్కీ చితాలేకు కోర్టులో చుక్కెదురైంది. ఆమెకు థానేలోని మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ నిరాకరించింది. చితాలే చేసిన వ్యాఖ్యల తీవ్రత కారణంగా ఆమెకు బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. అంతేకాదు, ఆమెకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ తీర్పు వెలువరించింది. 

29 ఏళ్ల చితాలేను పోలీసులు ఈ నెల 14న అరెస్ట్ చేశారు. అందుకు కారణం ఆమె ఫేస్ బుక్ లో చేసిన ఓ పోస్టు. "నువ్వు బ్రాహ్మణ విరోధివి, నీకోసం నరకం ఎదురుచూస్తోంది" అంటూ కేట్కీ చితాలే తన పోస్టులో పేర్కొంది. ఈ వ్యాఖ్యలు శరద్ పవార్ ను ఉద్దేశించి చేసినట్టుగా భావిస్తున్నారు. 

దాంతో ఆమెపై కల్వా, గోరేగావ్, ముంబయి పశ్చిమ శివారు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రబాలే పోలీస్ స్టేషన్ లో 2020లో ఆమెపై నమోదైన పాత కేసును కూడా పోలీసులు తిరగదోడారు. అంతేకాదు, ఆమెపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ.... మహారాష్ట్ర సంకీర్ణ సర్కారులో భాగస్వామి అన్న విషయం తెలిసిందే.