మాజీ సీఎం ఓం ప్ర‌కాశ్ చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.50 ల‌క్ష‌ల జ‌రిమానా

27-05-2022 Fri 15:38
  • ఆదాయానికి మించి ఆస్తుల కేసులో చౌతాలాకు శిక్ష ఖ‌రారు
  • నాలుగు ఆస్తుల స్వాధీనానికి కోర్టు ఆదేశం
  • ఇప్ప‌టికే టీచ‌ర్ల కుంభ‌కోణంలో దోషిగా తేలిన చౌతాలా
  • ప‌దేళ్ల పాటు జైలులో ఉండి ఇటీవ‌లే విడుద‌లైన మాజీ సీఎం
Delhi Court awards four year jail term to former Haryana CM Chautala in disproportionate assets case
హ‌ర్యానా మాజీ సీఎం, ఇండియ‌న్ లోక్ ద‌ళ్ మాజీ అధ్య‌క్షుడు ఓం ప్రకాశ్ చౌతాలాకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష ఖ‌రారైంది. ఈ శిక్ష‌తో పాటు ఆయ‌న‌కు రూ.50 ల‌క్ష‌ల జ‌రిమానాను విధిస్తూ ఢిల్లీ కోర్టు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ కేసులో చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తుల‌ను కూడా స్వాధీనం చేసుకోవాల‌ని కోర్టు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది.

హ‌ర్యానాలో అర్హ‌త లేని వారిని ఉపాధ్యాయులుగా నియ‌మించార‌న్న కేసులో ఇప్ప‌టికే దోషిగా తేలి ప‌దేళ్ల పాటు జైలు జీవితం గ‌డిపి ఏడాది క్రిత‌మే చౌతాలా విడుద‌ల‌య్యారు. ఈ క్ర‌మంలో ఇంత‌కుముందే ఆయ‌న‌పై దాఖ‌లైన ఆదాయానికి మించి ఆస్తులు కూడ‌బెట్టార‌న్న కేసులోనూ విచార‌ణ వేగం పుంజుకుంది. ఈ క్ర‌మంలో గ‌త వార‌మే విచార‌ణ‌ను ముగించిన కోర్టు... చౌతాలాను దోషిగా తేల్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా శుక్ర‌వారం ఈ కేసులో చౌతాలాకు శిక్ష ఖ‌రారు చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది.