మహిళల టీ20 చాలెంజ్: దీప్తి శర్మ జట్టుపై స్మృతి మంధాన టీం విజయం

  • అర్ధ సెంచరీలతో విరుచుకుపడిన మేఘన, రోడ్రిగ్స్
  • భారీ లక్ష్య ఛేదనలో చతికిలపడిన వెలాసిటీ
  • కిరణ్ నవ్‌గిరే సూపర్ ఇన్నింగ్స్ వృథా
  • సూపర్ నోవాస్-వెలాసిటీ జట్ల మధ్య రేపు ఫైనల్
Velocitys chase crumbles after Navgire special

మహిళల టీ20 చాంపియన్స్ చాలెంజ్‌లో భాగంగా గత రాత్రి పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో వెలాసిటీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ట్రయల్ బ్లేజర్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.

ఓపెనర్ ఎస్.మేఘన, జెమీమా రోడ్రిగ్స్ అర్ధ సెంచరీలతో విరుచుకుపడ్డారు. మేఘన 47 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేయగా, రోడ్రిగ్స్ 44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 66 పరుగులు చేసింది. వీరి దెబ్బకు స్కోరు బోర్డు పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ 27, డంక్లీ 19 పరుగులు చేశారు. వెలాసిటీ బౌలర్లలో సిమ్రన్ బహదూర్‌కు రెండు వికెట్లు దక్కాయి. 

అనంతరం 191 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దీప్తి శర్మ సారథ్యంలోని వెలాసిటీ జట్టు ప్రత్యర్థి బౌలర్ల ముందు నిలవలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కిరణ్ నవ్‌గిరే పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో కిరణ్ 69 పరుగులు చేసింది. 

ఇక షెఫాలీ వర్మ 29, యస్తికా భాటియా 19, లారా 17, స్నేహ్ రాణా 11, సిమ్రన్ బహదూర్ 12 పరుగులు చేశారు. ట్రయల్ బ్లేజర్స్ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. జెమీమా రోడ్రిగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సూపర్ నోవాస్-వెలాసిటీ జట్ల మధ్య రేపు ఫైనల్ జరగనుంది.

More Telugu News