ఒంగోలులో టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. మ‌హానాడు తీర్మానాల‌పై చ‌ర్చ‌

26-05-2022 Thu 21:50
  • రేప‌టి నుంచే టీడీపీ మ‌హానాడు
  • ఒంగోలు స‌మీపంలో రెండు రోజుల పాటు వేడుక‌లు
  • రాజ‌కీయ తీర్మానంపై పొలిట్ బ్యూరో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌
tdp politburo meeting started in ongole
ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ రెండు రోజుల పాటు నిర్వ‌హించ‌నున్న మ‌హానాడుకు హాజ‌ర‌య్యేందుకు దాదాపుగా పార్టీ శ్రేణులంతా ఇప్ప‌టికే ఒంగోలు చేరుకున్నాయి. పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు కూడా గురువారం సాయంత్రానికే ఒంగోలు చేరుకున్నారు. ఈ క్ర‌మంలో మ‌హానాడులో ప్ర‌వేశ‌పెట్టాల్సిన తీర్మానాల ఖ‌రారుపై పార్టీ అత్యున్న‌త నిర్ణాయ‌క విభాగం పొలిట్ బ్యూరో కాసేప‌టి క్రితం ఒంగోలులో భేటీ అయ్యింది.

రేప‌టి నుంచి రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న మ‌హానాడులో మొత్తం 17 అంశాల‌పై టీడీపీ తీర్మానాల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఇత‌ర అంశాల‌పై అంత‌గా ప‌ట్టింపు లేకున్నా.. రాజ‌కీయ అంశంపై ప్ర‌వేశ‌పెట్టే తీర్మానంపై పొలిట్ బ్యూరో ప్ర‌ధానంగా దృష్టి సారించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓట్ల చీలిక లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటామంటూ ఇటీవ‌ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఇదే అంశంపై రాజ‌కీయ తీర్మానం ప్ర‌వేశ‌పెట్టే దిశ‌గా పొలిట్ బ్యూరో స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్లు స‌మాచారం.