India: 15 గోల్స్ తేడాతో గెలిస్తేనే సూపర్-4 బెర్తు... 16 గోల్స్ కొట్టి హాకీ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన భారత్

India beat Indonesia with 16 goals margin to secure place in Asia Cup Hockey tourney semis
  • ఆసియా కప్ లో అద్భుతం
  • చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ గోల్స్ వర్షం
  • 16-0 తేడాతో ఆతిథ్య ఇండోనేషియాపై ఘనవిజయం
  • సింహాల్లా విజృంభించిన భారత హాకీ ఆటగాళ్లు
ఆసియా కప్ లో భారత్ అద్భుతమే చేసింది. సూపర్-4 దశ చేరుకోవడానికి 15 గోల్స్ తేడాతో గెలవాల్సి ఉండగా, ఇవాళ ఆతిథ్య ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 16-0తో గెలిచి హాకీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత్, ఇండోనేషియా జట్ల మధ్య నేడు జరిగిన పూల్-ఏ చివరి లీగ్ మ్యాచ్ గోల్స్ వర్షానికి వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్ లో భారత్ గనుక కనీసం 15 గోల్స్ తేడాతో గెలవకపోతే, సూపర్-4 బెర్తు పాకిస్థాన్ వశమవుతుంది.  

ఈ నేపథ్యంలో భారత హాకీ ఆటగాళ్లు సింహాల్లా విజృంభించారు. ప్రత్యర్థి ఇండోనేషియా జట్టును ఉక్కిరిబిక్కిరి చేస్తూ గోల్ పోస్ట్ పై ఎడతెరిపిలేని దాడులు నిర్వహించారు. మ్యాచ్ మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందన్న దశలోనూ భారత్ గోల్స్ కొడుతూనే ఉంది. సుదేవ్ హ్యాట్రిక్ గోల్స్ చేయగా, డిస్పన్ టిర్కీ 4 గోల్స్ చేశాడు. పవన్, సునీల్, సెల్వం కూడా గోల్స్ చేయడంతో భారత్ రికార్డు స్థాయిలో గోల్స్ వేట సాగించింది. పాపం... ఇండోనేషియా ఆటగాళ్లు భారత గోల్ పోస్ట్ పై దాడులు అటుంచి, బంతిని తమ అధీనంలో ఉంచుకోవడానికి విఫలయత్నాలు చేశారు. 

ఆసియా కప్ లో భారత్ లీగ్ దశలో తొలుత పాకిస్థాన్ తో 1-1తో డ్రా చేసుకుంది జపాన్ చేతిలో 2-5తో పరాజయం పాలైంది. దాంతో, పాకిస్థాన్ కంటే మెరుగైన గోల్ రేట్ సాధిస్తేనే భారత్ కు సెమీస్ చాన్స్ అని సమీకరణాలు స్పష్టం చేశాయి.

ఆ గోల్స్ తేడా ఒకటో, రెండో అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏకంగా 15 గోల్స్ తేడా అనే సరికి, భారత్ ముందంజ వేసే విషయంలో ఈ స్థాయి అద్భుతం జరుగుతుందని మ్యాచ్ కు ముందు ఎవరూ ఊహించలేదు. కానీ భారత ఆటగాళ్లు తమ సామర్థ్యంపై నమ్మకం ఉంచడంతో పాటు, అత్యంత పట్టుదలతో మ్యాచ్ బరిలో దిగారు. అసాధ్యమనుకున్న దానిని సాధ్యం చేసి చూపించారు. తద్వారా జపాన్, మలేసియా, దక్షిణ కొరియాల సరసన సూపర్-4లో స్థానం దక్కించుకుంది. భారత్ తమ సెమీస్ చాన్సుకు ఈ రీతిలో గండి కొడుతుందని ఏమాత్రం ఊహించలేని పాకిస్థాన్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
India
Indonesia
Goals
Asia Cup Hockey
Pakistan

More Telugu News