జగన్ కు చిత్తశుద్ధి ఉంటే పులివెందుల కేంద్రంగా అంబేద్కర్ జిల్లాను ఏర్పాటు చేయాలి: జనసేన నేత మహేశ్

26-05-2022 Thu 18:23
  • అంబేద్కర్ ఖ్యాతిని తగ్గించేందుకు వైసీపీ యత్నిస్తోంది
  • కోనసీమ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టింది
  • వైసీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు
Janasena leader Pothina Mahesh demands Ambedkar district with Pulivendula head quarter
కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏపీ ప్రభుత్వం మార్చడంతో అమలాపురంలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే అల్లర్లకు పాల్పడింది మీరంటే మీరేనని అధికార, ప్రతిపక్షాలు ఆరోపించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్ మాట్లాడుతూ, తమ అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థంలేనివని అన్నారు. 

ఈ ప్రభుత్వానికి, సీఎం జగన్ కు చిత్తశుద్ధి ఉంటే, అంబేద్కర్ పై గౌరవం ఉంటే కడప జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కడపకు ఆ పేరు పెట్టలేకపోతే పులివెందుల కేంద్రంగా 27వ జిల్లాను ఏర్పాటు చేసి దానికి అంబేద్కర్ పేరును పెట్టాలని సూచించారు. తన సొంత నియోజకవర్గానికి అంబేద్కర్ పేరును జగన్ పెడితే ఆయన చిత్తశుద్ధి అందరికీ తెలుస్తుందని అన్నారు. 

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను రాజకీయాల్లోకి లాగి ఆయన ఖ్యాతిని తగ్గించేందుకు వైసీపీ యత్నిస్తోందని మహేశ్ దుయ్యబట్టారు. పచ్చటి కోనసీమలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టిందని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని అన్నారు.