ఒంటరిగా అజర్ బైజాన్ యాత్రకు వెళ్లి అదృశ్యమైన తెలుగు యువకుడు

26-05-2022 Thu 16:49
  • ఏప్రిల్ 26న అజర్ బైజాన్ వెళ్లిన మణికాంత్
  • మణికాంత్ రాజమండ్రి వాసి
  • ఈ నెల 12 తర్వాత కనిపించకుండాపోయిన వైనం
  • కుటుంబ సభ్యుల్లో ఆందోళన
Telugu youth gone missing in Azerbaijan
ఓ తెలుగు యువకుడు ఒంటరిగా అజర్ బైజాన్ దేశానికి వెళ్లి, అక్కడ కనిపించకుండాపోవడం అతడి కుటుంబంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అతడి పేరు మణికాంత్ కొండవీటి. 28 ఏళ్ల మణికాంత్ కు ప్రపంచయాత్రలు చేయడం అంటే ఎంతో మక్కువ. మణికాంత్ స్వస్థలం ఏపీలోని రాజమండ్రి. ముంబయిలో ఉద్యోగం చేస్తున్నాడు. గత నెల 26న అతడు అజర్ బైజాన్ లోని బాకు నగరానికి వెళ్లాడు. ఆ తర్వాత రెండు వారాలుగా అతడి నుంచి ఎలాంటి సందేశాలు రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

మణికాంత్ ఒక్కోసారి ట్రెక్కింగ్ వెళ్లినా హోటల్ కు తిరిగి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడేవాడు. అలాంటిది, రోజుల తరబడి తమ బిడ్డ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేసింది. మణికాంత్ తమ్ముడు ధరణ్ కొండవీటి హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఇన్ స్టాగ్రామ్ పేజి ద్వారా ఈ విషయాన్ని అందరికీ వివరించాడు. 

తన సోదరుడి ఫొటోలు కొన్ని పోస్టు చేసిన ధరణ్... ఆ ఫొటోల్లో ఉన్నది తన అన్నయ్య అని, మే 12 తర్వాత అతడి నుంచి ఎలాంటి స్పందన లేదని వివరించాడు. తమ కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం అని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో తాము అజర్ బైజాన్ లోని భారత ఎంబసీని సంప్రదించామని ధరణ్ తెలిపాడు. బహుశా అతడు పర్వత ప్రాంతాల్లో ఉండొచ్చని, తాము అతడి ఆచూకీ తప్పక కనుగొంటామని భారత ఎంబసీ సిబ్బంది చెప్పారని వివరించాడు. 

అయితే, ఆ మరుసటి రోజు మణికాంత్ లగేజి ఓ హోటల్ వద్ద ఉన్నట్టు గుర్తించారని, అతడి గూగుల్ అకౌంట్ ను యాక్సెస్ చేస్తే, మే 13వ తేదీన బాకు నగర శివార్లలో ఓ గుడిసె వద్ద ఉన్నట్టు లొకేషన్ చూపించిందని ధరణ్ వెల్లడించాడు. దాంతో అతడికి ఏమై ఉంటుందన్న భయాందోళనలు తమను చుట్టుముట్టాయని పేర్కొన్నాడు. 

తమ సోదరుడి ఆచూకీ కోసం ముఖ్యమంత్రి, హోంమంత్రి, ప్రధానమంత్రి అందరినీ సంప్రదించామని, అతడ్ని కనుగొనేందుకు శక్తిమేర ప్రయత్నిస్తున్నామని ధరణ్ తెలిపాడు. అజర్ బైజాన్ వ్యక్తులతో పరిచయం ఉన్నవాళ్లెవరైనా తమకు ఈ విషయంలో సాయపడాలని విజ్ఞప్తి చేశాడు. తమ సోదరుడి ఆచూకీ కనుగొనడంలో సాయం చేస్తే జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నాడు.