హనుమాన్ చాలీసా మళ్లీ పఠిచావంటే!... ఎంపీ న‌వ‌నీత్ కౌర్‌కు బెదిరింపులు!

26-05-2022 Thu 16:39
  • హ‌నుమాన్ చాలీసా వివాదంలో అరెస్టయిన న‌వ‌నీత్‌
  • తాజాగా ఎంపీకి బెదిరింపు ఫోన్ కాల్స్‌
  • ఢిల్లీ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన అమ‌రావ‌తి ఎంపీ
MP Navneet Rana gets 11 life threatening calls
హ‌నుమాన్ చాలీసా ప‌ఠ‌నంపై నెల‌కొన్న వివాదంతో అరెస్టయి ప‌ది రోజుల పాటు జైలు జీవితం గ‌డిపిన అమ‌రావ‌తి ఎంపీ న‌వ‌నీత్ కౌర్‌కు ఇప్పుడు బెదిరింపులు మొద‌ల‌య్యాయి. హ‌నుమాన్ చాలీసా మళ్లీ ప‌ఠించావంటే ఇక అంతేనంటూ గుర్తు తెలియని వ్య‌క్తులు మ‌హిళా ఎంపీకి బెదిరింపు ఫోన్ కాల్స్ చేశార‌ట‌. ఇప్ప‌టిదాకా ఇలా 11 కాల్స్ రాగా... వాటిపై ఢిల్లీ పోలీసుల‌కు న‌వ‌నీత్ ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదుపై కేసు న‌మోదు చేసిన ఢిల్లీ పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మ‌హారాష్ట్రలోని అమ‌రావతి లోక్ స‌భ స్థానం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన న‌వ‌నీత్ కౌర్‌.. హ‌నుమాన్ జ‌యంతి రోజున సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే హ‌నుమాన్ చాలీసా ప‌ఠించాల‌ని, లేదంటే ఆయ‌న ఇంటి ఎదుట తామే హ‌నుమాన్ చాలీసా ప‌ఠిస్తామంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

ఈ వ్యాఖ్య‌ల‌పై శివ‌సేన శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ న‌వ‌నీత్ ఇంటిని ముట్ట‌డించేందుకు య‌త్నించారు. ఈ క్ర‌మంలో న‌వ‌నీత్ స‌హా ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న ఆమె భ‌ర్త ర‌వి రాణాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. 10 రోజుల త‌ర్వాత ముంబై సెష‌న్స్ కోర్టు బెయిల్ ఇవ్వ‌డంతో వారిద్ద‌రూ విడుద‌ల‌య్యారు.