వంట చేయడం ఆలస్యమైందని భార్యని కొట్టి భావిలోకి తోసిన భర్త

26-05-2022 Thu 16:12
  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • పని నుంచి ఇంటికి వచ్చిన భర్త
  • వంట చేయకపోవడంతో భార్యపై ఆగ్రహం
  • ఇరువురి మధ్య వాగ్వాదం
  • లాండ్రీ బ్యాట్ తో భార్యపై దాడి
Husband hit and throw wife into well
మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. భార్య వంట చేయకపోవడంతో ఓ వ్యక్తి తీవ్ర ఆగ్రహంతో భార్యను కొట్టి బావిలో పడేశాడు. ఇక్కడి దేవాస్ ప్రాంతంలోని తిల్యాఖేదీలో దినేశ్ మాలి అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. పని నుంచి ఇంటికి తిరిగొచ్చిన అతను "ఇంకా వంట కాలేదా?" అని భార్యను అడిగాడు. అయితే, తాను ఇంకా వంట చేయలేదని, కొంత సమయం పడుతుందని భార్య యశోద జవాబిచ్చింది. తాను ఇంటి పనిలో తలమునకలుగా ఉన్నానని తెలిపింది. 

అయితే, భార్య వంట చేయకపోవడంతో దినేశ్ మాలి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దినేశ్ అక్కడే ఉన్న ఓ తెడ్డు కట్టెతో భార్యను తీవ్రంగా కొట్టాడు. ఇంతలో కుమార్తె నిఖిత అడ్డురాగా, ఆమెను కూడా కొట్టాడు. కాగా, బాగా దెబ్బలు తగలడంతో యశోద కిందపడిపోయింది. ఆమెను తీసుకెళ్లి ఓ బావిలో పడేసిన దినేశ్ మాలి, అక్కడ్నించి పరారయ్యాడు.

కుమార్తె నిఖిత ఈ విషయాన్ని బంధువులకు తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం తెలియడంతో, వారు బావి నుంచి యశోద మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా, యశోదను దినేశ్ మాలి బావిలో పడేసే సమయానికి ఆమె కొన ఊపిరితో ఉండుంటుందని, నీటిలో మునిగిన కారణంగా చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దినేశ్ మాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.