కొడుకు ఆసుపత్రి ప్రారంభోత్స‌వానికి హాజ‌రైన వివేకా హ‌త్య‌ కేసు నిందితుడు దేవిరెడ్డి

26-05-2022 Thu 16:10
  • క‌డ‌ప‌లో దేవిరెడ్డి కుమారుడి ఆసుప‌త్రి ప్రారంభోత్స‌వం
  • ప్రారంభోత్స‌వానికి హాజ‌రయ్యేందుకు దేవిరెడ్డికి క‌డ‌ప కోర్టు అనుమ‌తి
  • సీబీఐ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ దేవిరెడ్డి
ys viveka murder case accused gets short time bail for thursday
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఐదో నిందితుడిగా అరెస్టయిన‌ దేవిరెడ్డి శివ‌శంక‌ర్ రెడ్డి గురువారం జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. క‌డ‌ప‌లో త‌న కుమారుడు ఏర్పాటు చేసిన ఆసుప‌త్రి ప్రారంభోత్స‌వానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు. త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ దేవిరెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్ ప్ర‌స్తుతం హైకోర్టులో విచార‌ణ ద‌శ‌లో ఉంది.

అయితే కుమారుడి ఆసుప‌త్రి ప్రారంభోత్స‌వం నేప‌థ్యంలో గురువారం ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు దేవిరెడ్డిని జైలు బ‌య‌ట‌కు అనుమ‌తిస్తూ క‌డ‌ప కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గురువారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మ‌యంలో సీబీఐ అధికారులు వెంట రాగా...వారి వాహ‌నంలోనే దేవిరెడ్డి త‌న కుమారుడి ఆసుప‌త్రి ప్రారంభోత్స‌వానికి హాజ‌ర‌య్యారు. అక్కడ దేవిరెడ్డి వెన్నంటి సాగిన సీబీఐ అధికారులు కుటుంబ స‌భ్యులు మిన‌హా ఇత‌రులెవ్వ‌రితోనూ ఆయ‌న మాట్లాడ‌కుండా చూశారు. ఆసుప‌త్రి ప్రారంభోత్స‌వం పూర్తి కాగానే దేవిరెడ్డి తిరిగి జైలుకు వెళ్ల‌నున్నారు.