కోల్ కతాలో 21 ఏళ్ల యువ నటి ఆత్మహత్య

26-05-2022 Thu 15:50
  • ఇటీవలే నటి పల్లవి డే ఆత్మహత్య
  • కొన్నిరోజుల వ్యవధిలోనే బిదిషా దే మజుందార్ బలవన్మరణం!
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
  • బాయ్ ఫ్రెండ్ తో గొడవలే మృతికి కారణమంటున్న ఫ్రెండ్స్!
Bengali actress Bidisha De Majumdar commits suicide
బెంగాలీ వినోద రంగంలో మరోసారి విషాద ఛాయలు అలముకున్నాయి. ఇటీవల టీవీ నటి పల్లవి డే బలవన్మరణం చెందిన ఘటన మరువకముందే ఓ యువ నటి ఆత్మహత్యకు పాల్పడింది. 21 ఏళ్ల మోడల్, నటి బిదిషా దే మజుందార్  కోల్ కతాలోని తన అపార్ట్ మెంట్ లో విగతజీవురాలిగా దర్శనమిచ్చింది. తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన పోలీసులకు సీలింగ్ కు వేళ్లాడుతూ కనిపించింది. నగరంలోని డమ్ డమ్ ప్రాంతంలో బిదిషా తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. 

బిదిషా మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని ఆర్జే కర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే పోస్టుమార్టం నివేదిక వస్తే మరింత స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. బిదిషా 'భార్-ద క్లౌన్' అనే లఘు చిత్రంలో నటించింది. మోడలింగ్ రంగంలోనూ రాణిస్తోంది.

కాగా, నటి గది నుంచి పోలీసులు సూసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకున్నట్టు భావిస్తున్నారు. బిదిషాకు అనుభవ్ బేరా అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు తెలుస్తోంది. అతడితో ప్రేమ వ్యవహారం కారణంగా బిదిషా మానసిక కుంగుబాటుకు గురైందని ఆమె స్నేహితులు అంటున్నారు.