మసీదులు తవ్వడాన్ని పక్కన పెట్టి.. కేంద్రం నుంచి నిధులు తీసుకురండి: గంగుల క‌మ‌లాక‌ర్

26-05-2022 Thu 15:31
  • తెలంగాణలో మసీదులను తవ్వాలన్న బండి సంజయ్
  • మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దన్న గంగుల
  • ఇతర మతాలను గౌరవించాలని సూచన
Gangula Kamalakar fires on Bandi Sanjay
తెలంగాణలోని మసీదులన్నింటినీ తవ్వాలని... అందులో శవం వస్తే మీదని, శివలింగం వస్తే తమదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దూసుకుపోతున్న తరుణంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ఇలాంటి వ్యాఖ్యలు తగవని అన్నారు. 

తెలంగాణలో ఇప్పటి వరకు మతకలహాలు లేవని... ఇకపై కూడా రాష్ట్రం ప్రశాంతంగానే ఉండాలని చెప్పారు. మత కలహాలు ఉన్న ప్రాంతం అభివృద్ధికి నోచుకోదని... దీనికి గుజరాత్ ఉదాహరణ అని చెప్పారు. మసీదులను తవ్వడాన్ని పక్కన పెట్టి, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులను తీసుకురావడంపై బండి సంజయ్ దృష్టి సారించాలని అన్నారు. ఇతర మతాలను గౌరవించడాన్ని నేర్చుకోవాలని... రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని చెప్పారు.