అలా జరిగుంటే చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ శవ రాజకీయాలు చేసేవారు: కొడాలి నాని

26-05-2022 Thu 14:59
  • నిక్కర్లు వేసుకునే పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుకున్నారన్న నాని
  • అంబేద్కర్ ను వ్యతిరేకించేవాళ్లని జైల్లో పెట్టాలని వ్యాఖ్య
  • వైసీపీ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ముఖ్యమన్న నాని 
kodali Nani fires on Pawan Kalyan
అమలాపురంలో చోటుచేసుకున్న హింసకు ప్రతిపక్ష పార్టీలే కారణమని వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. నిక్కర్లు వేసుకునే పిల్లలను రెచ్చగొట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ పబ్బం గడుపుకున్నారని అన్నారు. అంబేద్కర్ ను వ్యతిరేకించే వాళ్లకు దేశ బహిష్కరణ విధించాలని, జైళ్లలో పెట్టాలని చెప్పారు. 

ఎవరో రాసిచ్చిన స్క్రిస్ట్ ను చదువుతూ, రాజ్యాంగంపై కనీస అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని పవన్ ను ఉద్దేశించి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యకర్తలంతా నిక్కర్లు వేసుకునే బుడ్డోళ్లేనని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ముఖ్యమని చెప్పారు. 

అమలాపురంలో హింస చోటుచేసుకున్నప్పుడు పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేసి ఉంటే పరిస్థితి వెంటనే అదుపులోకి వచ్చేదని... కానీ ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని అలాంటి పని చేయలేదని కొడాలి నాని అన్నారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు తగలబడినా, పోలీసులకు గాయాలయినా సంయమనాన్ని పాటించారని చెప్పారు. ఒకవేళ పోలీసులు కాల్పులు జరిపి ఉంటే చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ శవ రాజకీయాలు చేసేవారని అన్నారు.