ఇన్ఫోసిస్ బాస్ కు భారీ వేతన పెంపు.. రూ.71 కోట్లు

26-05-2022 Thu 13:39
  • 2021-22లో 44 శాతం అధింకగా చెల్లింపులు
  • 2027 వరకు ఎండీ, సీఈవోగా కొనసాగింపు
  • పారితోషికం తీసుకోని చైర్మన్ నందన్ నీలేకని
Infosys CEO Salil Parekh was paid 71 crore in FY22 43 percent annual hike
ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ భారీ వేతన పెంపును అందుకున్నారు. 2021-22లో ఆయనకు ఇన్ఫోసిస్ రూ.71 కోట్ల వేతనాన్ని చెల్లించింది. అంతకుముందు 2020-21 ఆర్థిక సంవత్సరంలో చేసిన రూ.49.7 కోట్ల చెల్లింపులతో పోలిస్తే 44 శాతం ఎక్కువ. ఈ వివరాలను ఇన్ఫోసిస్ స్వయంగా విడుదల చేసింది.

2027 వరకు సీఈవోగా ఆయన్నే కొనసాగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2018లో సలీల్ పరేఖ్ ను సీఈవో, ఎండీగా ఇన్ఫోసిస్ నియమించుకుంది. డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్, వ్యాపారాలను టర్న్ అరౌండ్ చేయడం, సంస్థలను కొనుగోలు చేయడంలో పరేఖ్ కు ట్రాక్ రికార్డు ఉందంటూ, ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్టు ఇన్ఫోసిస్ స్టాక్ ఎక్సేంజ్ లకు తెలియజేసింది. 

పరేఖ్ తర్వాత ఇన్ఫోసిస్ లో అత్యధికంగా రూ.37.25 కోట్లను స్వీకరించిన వ్యక్తి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అయిన ప్రవీణ్ రావు. కంపెనీ ప్రెసిడెంట్ గా ఉన్న రవి కుమార్ రూ.35.82 కోట్లను అందుకున్నారు. ఇక సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ చైర్మన్ గా ఉన్న నందన్ నీలేకని ఎటువంటి పారితోషికం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.