వైసీపీ ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర.. నేడు శ్రీకాకుళంలో ప్రారంభం

26-05-2022 Thu 08:10
  • నాలుగు రోజులపాటు కొనసాగనున్న యాత్ర
  • విజయనగరం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురంలలో బహిరంగ సభలు
  • పాల్గొననున్న 17 మంది మంత్రులు
YSRCP Samajika Nyayabheri yatra starts today from Srikakulam
‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్రకు వైసీపీ సిద్ధమైంది. నేటి నుంచి నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమం నేడు శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభం కానుంది. బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 

ఈ నాలుగు రోజుల్లో నాలుగు చోట్ల అంటే.. విజయనగరం, రాజమండ్రి, నరసరావుపేట, అనంతపురంలలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. నేడు శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల జంక్షన్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి యాత్ర ప్రారంభిస్తారు. అనంతరం ఎచ్చెర్ల, రణస్థలం మీదుగా యాత్ర విజయనగరం చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడతారు. 

అనంతరం విశాఖపట్టణం చేరుకుంటారు. రేపు అక్కడ బయలుదేరి అనకాపల్లి జంక్షన్, యలమంచిలి, జగ్గంపేట మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ నిర్వహించిన అనంతరం తాడేపల్లిగూడెంలో బస చేస్తారు. 

28న అక్కడి నుంచి బయలుదేరి ఏలూరు బైపాస్, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ తూర్పు, చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట చేరుకుని బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి నంద్యాలలో బస చేసి 29న కర్నూలు, డోన్, గార్లదిన్నె మీదుగా అనంతపురం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు ప్రసంగించడంతో యాత్ర ముగుస్తుంది.