రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనకు క్లియరెన్స్ లేదన్న కేంద్రం.. అవసరం లేదన్న కాంగ్రెస్

26-05-2022 Thu 07:02
  • బ్రిటన్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ
  • ఎంపీలకు పొలిటికల్ క్రియరెన్స్ అవసరమన్న ప్రభుత్వం
  • ప్రైవేటు కార్యక్రమాలకు ఎందుకని ప్రశ్నించిన కాంగ్రెస్
  • పీఎంవో నుంచి వచ్చే సందేశాలను పట్టించుకోవద్దన్న రణదీప్ సూర్జేవాలా 
Congress says no need to political clearance to Rahul Gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనపై దుమారం రేగుతోంది. ఆయన అక్కడికి వెళ్లేందుకు అవసరమైన ‘పొలిటికల్ క్లియరెన్స్’ను పొందలేదని ప్రభుత్వం చెబుతుండగా, ప్రైవేటు కార్యక్రమాలకు అవసరం లేదని కాంగ్రెస్ వాదిస్తోంది. సాధారణంగా అయితే పార్లమెంటు సభ్యుడు ఎవరైనా విదేశీ పర్యటనకు వెళ్తే భారత విదేశీ వ్యవహారాల శాఖ నుంచి పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మూడు వారాలముందే ఆ శాఖ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే, రాహుల్ మాత్రం దరఖాస్తు చేసుకోలేదని ప్రభుత్వం పేర్కొంది.

దీనిపై కాంగ్రెస్ పార్టీ వాదన మరోలా ఉంది. అధికారిక బృందం అయితే తప్ప ప్రధాని నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఎంపీలు పొలిటికల్ క్లియరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి టీవీ చానళ్లకు అందిన వాట్సాప్ సందేశాలను గుడ్డిగా నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా స్పష్టం చేశారు.