పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్

25-05-2022 Wed 21:33
  • అమలాపురం అల్లర్లపై పవన్ స్పందించిన తీరు దారుణమన్న అంబటి
  • మా మంత్రి ఇంటిని మేమే తగులబెట్టుకున్నామా అని ప్రశ్న
  • రాష్ట్రం శ్రీలంకలా మారిందని చూపించాలనుకున్నారని మండిపాటు
Ambati Rambabu fires on Pawan Kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. అమలాపురంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై పవన్ స్పందించిన తీరు దారుణంగా ఉందని ఆయన అన్నారు. జిల్లా పేరు కోసం ప్రజల నుంచి డిమాండ్ వచ్చినప్పుడు పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని జనసేనకు చెందిన వారు ఎందుకు నిరాహారదీక్ష చేశారని ప్రశ్నించారు. మీ డిమాండ్ ను, ప్రజల డిమాండ్ ను ప్రభుత్వం అంగీకరించింది కదా అని ప్రశ్నించారు. 

మా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను మేమే తగులబెట్టుకున్నామా? అని అడిగారు. ఏపీ శ్రీలంక అవుతుందని చంద్రబాబు, పవన్ అన్నారని... ఇప్పుడు శ్రీలంకను చేయడానికి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. మంత్రి ఇంటిని తగలబెట్టి రాష్ట్రం శ్రీలంకలా మారిందని చూపించాలనుకుంటున్నారని చెప్పారు. మంటలు ఆర్పడానికి ఫైర్ ఇంజిన్ రాకుండా అడ్డుకున్నారని తెలిపారు.