డ్ర‌గ్స్ కేసులో మాజీ ఎంపీ ఆదికేశ‌వులు నాయుడు కుమారుడు అరెస్ట్‌

25-05-2022 Wed 18:41
  • శ్రీనివాసులు నాయుడు ఇంటిలో ఎన్‌సీబీ సోదాలు
  • భారీగా డ్ర‌గ్స్ దొరికిన‌ట్లు స‌మాచారం
  • నాయుడు స‌హా ప‌లువురి ఇళ్ల‌లో ఎన్‌సీబీ సోదాలు
మాద‌క ద్ర‌వ్యాల స‌ర‌ఫ‌రా ఆరోప‌ణ‌ల‌తో దివంగ‌త ఎంపీ డీకే ఆదికేశ‌వులు నాయుడు కుమారుడు డీకే శ్రీనివాసులు నాయుడును నార్కోటిక్స్ డ్ర‌గ్స్ కంట్రోల్ (ఎన్‌సీబీ) అధికారులు బుధ‌వారం అరెస్ట్ చేశారు. రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖుల‌కు శ్రీనివాసులు నాయుడు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో బుధ‌వారం ఎన్‌సీబీ అధికారులు బెంగ‌ళూరులోని శ్రీనివాసులు నాయుడు స‌హా పలువురు ఇళ్ల‌లో సోదాలు నిర్వ‌హించారు. ఈ సోదాల్లో శ్రీనివాసులు నాయుడు ఇంటిలో భారీ ఎత్తున డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డిన‌ట్లు స‌మాచారం.

చిత్తూరు కేంద్రంగా రాజ‌కీయాలు సాగిస్తున్న‌ డీకే ఆదికేశ‌వులు నాయుడు కుటుంబం బెంగ‌ళూరు కేంద్రంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరులోనే శ్రీనివాసులు నాయుడు ఉంటున్నారు. ఏపీ, క‌ర్ణాట‌కకు చెందిన ప‌లువురు రాజ‌కీయ‌, సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖుల‌తో ఆయన సంబంధాలు నెర‌పుతున్నట్లు స‌మాచారం.