రావుల‌పాలెంలో హైటెన్ష‌న్‌... తూర్పు గోదావ‌రి జిల్లా ఎస్పీ కారుపై రాళ్ల దాడి

25-05-2022 Wed 18:11
  • రావుల‌పాలెం రింగు రోడ్డు వ‌ద్ద ఘ‌ట‌న‌
  • దాడిలో ఎస్పీ, పోలీసు సిబ్బందికి త‌ప్పిన ముప్పు
  • పోలీసు బ‌ల‌గాల‌ను చూసి ప‌రారైన ఆందోళ‌న‌కారులు
కోన‌సీమ జిల్లాలో రెండో రోజైన బుధ‌వారం కూడా ఆందోళ‌న‌లు చెల‌రేగాయి. మంగ‌ళ‌వారం జిల్లా కేంద్రం అమ‌లాపురంలో ఆందోళ‌న‌కారులు విధ్వంసానికి పాల్ప‌డ‌గా... తాజాగా జిల్లాలోని రావుల‌పాలెంలో ఆందోళ‌న‌కారులు రెచ్చిపోయారు. అటుగా వెళుతున్న తూర్పు గోదావ‌రి జిల్లా ఎస్పీ ఐశ్వ‌ర్య ర‌స్తోగి కారుపై ఆందోళ‌న‌కారులు రాళ్లు రువ్వారు. రావుల‌పాలెం రింగు రోడ్డు వ‌ద్ద చోటుచేసుకున్న ఈ దాడిలో ఎస్పీకి గానీ, పోలీసు సిబ్బందికి గానీ గాయాలేమీ కాలేదని స‌మాచారం.

అయితే అమ‌లాపురంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన అల్ల‌ర్ల నేప‌థ్యంలో జిల్లావ్యాప్తంగా భారీగా మోహ‌రించిన పోలీసులు.. తూర్పు గోదావ‌రి జిల్లా ఎస్పీ కారుపై రాళ్ల దాడి జ‌రిగింద‌న్న స‌మాచారంతో క్ష‌ణాల్లోనే అక్క‌డికి చేరుకున్నారు. పోలీసు బ‌ల‌గాల‌ను చూసిన ఆందోళ‌న‌కారులు అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు.