రేపు ఉద‌యం బెంగ‌ళూరుకు కేసీఆర్‌!.. మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌కు మోదీ!

25-05-2022 Wed 17:42
  • ఇటీవలే ఢిల్లీ, ఛండీగ‌ఢ్‌ల‌లో ప‌ర్య‌టించిన కేసీఆర్‌
  • తాజాగా గురువారం బెంగ‌ళూరుకు ప‌య‌నం
  • మోదీకి స్వాగ‌తం చెప్ప‌నున్న మంత్రి త‌ల‌సాని
  • 2.30 గంట‌ల పాటు హైద‌రాబాద్‌లో మోదీ ప‌ర్య‌ట‌న‌
ts minister talasani srinivas yadav will recieve pm modi in hyderabad tomorrow
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్ వ‌స్తున్న వేళ‌... తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేర‌నున్నారు. గురువారం ఉద‌యం బెంగ‌ళూరుకు కేసీఆర్ ప‌య‌నం కానున్నారు. ప‌లు పార్టీల‌తో మంత‌నాలు సాగిస్తున్న కేసీఆర్ ఇటీవ‌లే ఢిల్లీ, ఛండీగ‌ఢ్ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా గురువారం ఉద‌యం కేసీఆర్ బెంగ‌ళూరు వెళ్ల‌నున్నారు.

ఇదిలా ఉంటే... ఉద‌యం కేసీఆర్ హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరుకు బ‌య‌లుదేరిన కాసేపటికే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్ చేరుకోనున్నారు. ప‌లు కార్యక్ర‌మాల్లో పాలుపంచుకునే నిమిత్తం హైద‌రాబాద్ వ‌స్తున్న మోదీ.. మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు బేగంపేట‌ ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అనంత‌రం దాదాపుగా 2.30 గంట‌ల పాటు ఆయ‌న హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టిస్తారు. మోదీకి తెలంగాణ ప్రభుత్వం త‌ర‌ఫున మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు.