పోలీసుల అదుపులో అమ‌లాపురం అల్ల‌ర్ల కీల‌క నిందితుడు అన్యం సాయి

25-05-2022 Wed 16:46
  • జిల్లా పేరు మార్చొద్దంటూ గ‌తంలో సాయి ఆందోళ‌న‌
  • చొక్కా విప్పి కిరోసిన్ క్యాన్ చేత‌బ‌ట్టి ఆందోళ‌న చేసిన సాయి
  • ఆ దృశ్యాలు న్యూస్ ఛానెళ్ల‌లో వైర‌ల్‌గా మారిన వైనం
amalapuram clashes key accused anyam sai is in police custody
కోనసీమ జిల్లా పేరు మార్పుపై రాజుకున్న వివాదం నేప‌థ్యంలో జిల్లా కేంద్రం అమ‌లాపురంలో మంగ‌ళ‌వారం అల్ల‌ర్లు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఈ అల్ల‌ర్ల కీల‌క నిందితుడిగా భావిస్తున్న అన్యం సాయిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్ల‌ర్ల‌కు దారి తీసిన ప‌రిస్థితుల‌పై అత‌డిని విచారిస్తున్నారు. 

కోన‌సీమ జిల్లా పేరును డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా మార్చాలంటూ జిల్లాకు చెందిన ద‌ళిత సంఘాలు డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో జిల్లా పేరును మార్చొద్దంటూ అన్యం సాయి ఆందోళ‌న‌కు దిగాడు. ఈ క్ర‌మంలో జిల్లా పేరును మారిస్తే కిరోసిన్ పోసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటానంటూ చొక్కా విప్పేసి కిరోసిన్ క్యాన్ చేత‌బ‌ట్టిన అన్యం సాయి వీడియోలు ప్ర‌స్తుతం న్యూస్ ఛానెళ్ల‌లో వైర‌ల్‌గా మారిపోయాయి. ఆది నుంచి జిల్లా పేరును మార్చొద్దంటూ డిమాండ్ చేస్తున్న సాయి అమ‌లాపురం అల్ల‌ర్ల‌కు నేతృత్వం వ‌హించాడంటూ పోలీసులు అనుమానిస్తున్న సంగ‌తి తెలిసిందే.