మహానాడు కోసం రాత్రంతా మేము తోరణాలు కడితే.. మీరు విప్పుకుంటూ పోతారా?: అధికారులపై సోమిరెడ్డి ఫైర్

25-05-2022 Wed 14:30
  • ఒంగోలులో ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు
  • మహానాడు కోసం కట్టిన తోరణాలను తొలగించిన కార్పొరేషన్ అధికారులు
  • ప్రైవేటు వాహనాలను ఇచ్చిన వారిని కూడా బెదిరిస్తారా?
Somireddy Chandra Mohan Reddy fires on YSRCP for interrupting Mahanadu arrangements
ఒంగోలులో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు, టీడీపీ తోరణాలను కార్పొరేషన్ అధికారులు తొలగించారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దామచర్ల జనార్దన్ ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

'మా పార్టీ కార్యక్రమం కోసం మేము తోరణాలు కడుతూ పోతుంటే... మీరు విప్పుకుంటూ పోతారా?' అని సోమిరెడ్డి మండిపడ్డారు. వేడుక నిర్వహించడానికి తాము స్టేడియంకు ఇప్పటికే డబ్బు కట్టామని... అలాంటప్పుడు అనుమతి ఎందుకివ్వరని ప్రశ్నించారు. కలెక్టర్లు, ఎస్పీలు ఎందుకున్నట్టని అడిగారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేనే లేదని అన్నారు.

తెలుగోడు తల ఎత్తుకునే పరిస్థితిని ఎన్టీఆర్ తీసుకొస్తే... ఏపీ తల దించుకునే పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. మహానాడుకు ప్రైవేట్ వాహనాలు ఇచ్చిన వారిని బెదిరిస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు... నడిరోడ్డు మీద జగన్ మీటింగులు పెట్టినా అనుమతించామని... ఏ రోజూ అడ్డుకోలేదని చెప్పారు. వైసీపీ జోలికి తాము ఎప్పుడూ వెళ్లలేదని అన్నారు. అరచేతిని అడ్డం పెట్టి టీడీపీని ఆపలేరని... మహానాడు విజయవంతం కావడాన్ని అడ్డుకోలేరని చెప్పారు.

రాత్రంతా తాము తోరణాలు కడితే... కార్పొరేషన్ వాళ్లు ఉదయం వచ్చి తొలగించారని దామచర్ల జనార్దన్ మండిపడ్డారు. దీని గురించి కమిషనర్ ను అడిగితే కలెక్టర్ ను అడగాలని చెప్పారని అన్నారు. మహానాడు కోసం వారం క్రితమే తాము దరఖాస్తు చేశామని.. అయినా ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని చెప్పారు. జగన్ పాదయాత్ర చేపట్టినప్పుడు తాము ఆటంకాలు కలిగించామా? అని ప్రశ్నించారు. మరోవైపు, ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు కార్యక్రమం జరగనుంది.