ఒక ప్లాస్టిక్ నీళ్ల బకెట్ అమెజాన్ లో కేవలం రూ.33,691

  • 38 శాతం డిస్కౌంట్ ఆఫర్
  • దీంతో రూ.21,057కే సొంతం చేసుకోవచ్చు
  • రెండు మగ్గుల ధర రూ.10,000
  • విక్రేతల ట్రిక్ చేష్టలు
plastic bucket goes for Rs 21057 and bathroom mugs cost Rs 10000 after discount

ప్లాస్టిక్ నీళ్ల బకెట్ ధర ఎంత ఉండొచ్చు..? రూ.200-300. మహా అయితే రూ.500. కానీ, అమెజాన్ కు వెళ్లి ధర చూస్తే సొమ్మసిల్లిపోవాలేమో..? ‘బీవైమాల్ ప్లాస్టిక్ బకెట్’ ఎంఆర్పీ రూ.33,691.84. దీనిపై 38 శాతం తగ్గింపు ఇస్తున్నారు. దీంతో రూ.21,057కే ఈ బకెట్ ను సొంతం చేసుకోవచ్చు. వినడానికి, చూడ్డానికి కూడా ఇది విడ్డూరంగా అనిపించక మానదు. 

మరి ఇంత ధర పెట్టడం ఎందుకు? అన్న సందేహం రావచ్చు. ఇక్కడ రెండు అంశాలు ఉండి ఉంటాయి. ఒకటి సాంకేతిక లోపం కారణంగా ధర ఇలా దర్శనం ఇస్తుండొచ్చు. రెండోది.. సాంకేతిక లోటుపాట్లను సొమ్ము చేసుకునేందుకు సెల్లర్ ఇలా అధిక ధర పెట్టి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో హడావిడిగా షాపింగ్ చేసే వారు ఉంటారు. ఆ తరుణంలో పొరపాటుగా ఒకటి, రెండు ఆర్డర్లు వచ్చినా బాగానే మిగులుతుందన్న ఉద్దేశ్యంతో సెల్లర్ ఇలా ట్రిక్ పాటించి ఉండొచ్చు. 

దీనివల్ల కొనేవారు పెద్దగా ఉండరుగా... విక్రేతకు నష్టమే కదా..? అన్న సందేహం కూడా వస్తుంది. కానీ, సెల్లర్ తెలివైన వాడే అయి ఉంటాడు. మార్కెట్ ధరకే మరో పేరుతో విక్రయానికి ప్లాస్టిక్ నీళ్ల బకెట్ ను పెట్టి ఉండొచ్చు. రెండు ప్లాస్టిక్ మగ్గుల ధర రూ.10,000 అంటే ఎలా ఉంటుంది..? ఇలాంటి వింతలకు అమెజాన్ వేదికగా ఉందని చెప్పుకోవచ్చు. ట్విట్టర్ యూజర్లు భారీ ధరలతో కూడిన ఉత్పత్తుల స్క్రీన్ షాట్లను పంచుకుని కామెంట్లు పెడుతున్నారు. అమెజాన్ ప్లాట్ ఫామ్ లో ఉత్పత్తుల వివరాలను పోస్ట్ చేసేది విక్రేతలే. కనుక పొరపాటు అయితే ఒక అంకె ఎక్కువ పడుతుందేమో కానీ.. ఇంత ధర అయితే ఉండదు.

More Telugu News