వంటనూనెల దిగుమతిపై కస్టమ్స్ సుంకాలను తొలగించిన కేంద్రం.. దిగిరానున్న ధరలు!

25-05-2022 Wed 09:14 | National
  • దిగుమతి సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ తొలగింపు
  • 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో దిగుమతికి వర్తింపు
  • మినహాయింపు పొందేందుకు ఈ నెల 27 నుంచి జూన్ 18లోపు దరఖాస్తు చేసుకోవాలన్న కేంద్రం
  • చక్కెర ధరలకు కళ్లెం వేసేందుకు ఎగుమతులపై ఆంక్షలు
Edible oil Prices to Go down as India Allows as Duty Free Import of Crude Soyabean and Sunflower Oils
పేరెత్తితేనే భయపడేలా ఉన్న వంట నూనెల ధరలు త్వరలోనే తగ్గుముఖం పట్టనున్నాయి. అమాంతం పెరిగిన నూనె ధరలకు కళ్లెం వేయడంలో భాగంగా వంట నూనెల దిగుమతిపై విధిస్తున్న కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం తొలగించింది. ఈ మేరకు నిన్న ప్రకటించింది.

ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ఫ్లవర్) నూనె, మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల సోయాబీన్ నూనెల దిగుమతిపై ఇప్పటి వరకు విధిస్తున్న కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌ను తొలగించింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దుతిరుగుడు పువ్వు నూనెల దిగుమతికి ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆర్థికశాఖ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ప్రభుత్వ తాజా చర్యతో దేశీయంగా వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. అయితే, దిగుమతుల కోటా కోసం ఈ నెల 27 నుంచి జూన్ 18లోపు ఆయా సంస్థలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఈ గడువు మించితే మాత్రం గతంలోని సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35 లక్షల టన్నుల ముడి సోయాబీన్ నూనె, 16-18 లక్షల టన్నుల ముడి సన్‌ఫ్లవర్ నూనెలను దిగుమతి చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, దేశీయంగా పంచదార ధరలు పెరగకుండా చూసేందుకు ఎగుమతులకు పరిమితులు విధించింది. ప్రస్తుత సంవత్సరంలో చక్కెర ఎగుమతులను 10 మిలియన్ టన్నులకే ప్రభుత్వం పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.