COVID19: గుండె పనితీరును దారుణంగా దెబ్బతీస్తున్న కరోనా వైరస్: అధ్యయనంలో వెల్లడి

  • ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే గుండెలోని కుడివైపు భాగంపై వైరస్ ప్రభావం
  • వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న 121 మంది రోగులపై పరిశోధన
  • ప్రతి ముగ్గురిలో ఒకరి గుండె కుడివైపున దెబ్బతింటున్నట్టు గుర్తింపు
  • దీనివల్ల మరణం కూడా సంభవించే అవకాశం ఉందన్న శాస్త్రవేత్తలు
covid linked to impaired heart function scottish study finds

ప్రపంచాన్ని కలవరపెట్టిన కరోనా మహమ్మారికి సంబంధించి మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా మరణాలకు ఊపిరితిత్తులు దెబ్బతినడమే కారణమని ఇప్పటి వరకు తేలింది. వైరస్ ఊపిరితిత్తుల్లో ఉండిపోయి వాటి పనితీరును దారుణంగా దెబ్బతీస్తుందని ఇప్పటి వరకు నిర్వహించిన పరిశోధనల్లో తేలగా, తాజాగా యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, ఎన్‌హెచ్ఎస్ గోల్డెన్ జూబ్లీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో మరో విస్తుపోయే విషయం వెల్లడైంది.

కరోనా వైరస్ ఊపిరితిత్తులతో పాటు గుండె పనితీరును కూడా దారుణంగా దెబ్బతీస్తుందని ఈ పరిశోధనలో తేలింది. ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే గుండెలోని కుడివైపు భాగంపై వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐసీయూలలో వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న 121 మంది రోగులపై అధ్యయనం చేసిన అనంతరం వారీ విషయాన్ని వెల్లడించారు. తాము పరిశీలించిన ప్రతి ముగ్గురిలో ఒకరికి గుండె కుడివైపు దెబ్బతింటోందని, దీనివల్ల మరణం కూడా సంభవించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

కరోనా కారణంగా ఊపిరితిత్తులు బలహీనపడడం వల్ల అవి రక్తాన్ని స్వీకరించలేకపోతున్నాయని, అయితే, గుండె మాత్రం రక్తం పంపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఫలితంగా గుండెపైనా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని పరిశోధకుల్లో ఒకరైన కార్రడియోథొరాసిక్ ఎనస్థీషియా, ఇంటెన్సివ్ కేర్ విభాగానికి చెందిన ఫిలిప్ మెక్‌కాల్ పేర్కొన్నారు.

కరోనా వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు అర్థమైంది కాబట్టి, ఇకపై మరింత మెరుగైన చికిత్స ద్వారా దానిని అధిగమించవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన గోల్డెన్ జూబ్లీ ఇంటెన్సివ్ కేర్ నిపుణుడు బెన్ షెల్లీ తెలిపారు.

More Telugu News